Published 30 Nov 2023
సాయంత్రం దాకా టైముంటుంది కదా మెల్లగా వేద్దాంలే ఓటు అనుకుంటారు. పట్టణాలు, పెద్ద పెద్ద నగరాల్లోనే ఇలాంటి వాతావరణం ఉంటుంది. కానీ 7 గంటలకు పోలింగ్ మొదలవుతుందంటే పల్లెటూళ్లలో 6, ఆరున్నర నుంచే జనాలు క్యూలో ఉంటారు. అలాంటి వాతావరణాన్నే హైదరాబాద్ లోనూ చూపించారు కొందరు స్టార్ హీరోలు. పోలింగ్ ప్రారంభమవుతున్న సమయంలో ఉదయం ఏడింటి కన్నా ముందే ఓటు కోసం క్యూ కట్టారు. స్టార్ డమ్, సెలెబ్రిటీలం అన్న తేడా చూపించకుండా సామాన్యుల్లా తమ వంతు వచ్చేవరకు అరగంట నుంచి గంట పాటు లైన్ లోనే ఉన్నారు. చిరంజీవి, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నారు.
జూనియర్ NTR, అల్లు అర్జున్
చిరంజీవి, జూనియర్ NTR, అల్లు అర్జున్, సుమంత్ తదితరులు జూబ్లీహిల్స్ లోని పోలింగ్ స్టేషన్లలో ఓటు వేశారు. మెగాస్టార్ చిరంజీవి తన సతీమణి సురేఖతో కలిసి ఓబుల్ రెడ్డి స్కూల్ లో ఓటు వేశారు. నేషనల్ అవార్డీ అల్లు అర్జున్ BSNL సెంటర్ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. తన మాతృమూర్తితోపాటు సతీమణి ప్రణతితో కలిసి ఓబుల్ రెడ్డి స్కూల్ లోని పోలింగ్ సెంటర్ కు చేరుకున్న జూనియర్ NTR.. చాలా సేపు ఓపికగా లైన్ లోనే ఉన్నారు. అటు మరో నటుడు సుమంత్ జూబ్లీహిల్స్ క్లబ్ లో.. ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ లో ఓటు వేశారు.