Published 01 Dec 2023
ఆస్ట్రేలియాతో జరుగుతున్న టీ20 సిరీస్ ను భారత జట్టు గెలుచుకుంది. వరుసగా రెండు మ్యాచ్ లు గెలిచి మూడో టీ20లో ఓటమి పాలైనా నాలుగో మ్యాచ్ లో విజయం సాధించి మరో మ్యాచ్ ఉండగానే సిరీస్ ను సొంతం చేసుకుంది. రాయ్ పూర్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. 9 వికెట్లకు 174 రన్స్ చేసింది. అనంతరం సాధారణ టార్గెట్(Normal Target)తో బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా.. భారత బౌలర్ల ధాటికి కంగారూ పడింది. నిర్ణీత ఓవర్లో కంగారూ జట్టు 7 వికెట్లకు 154 రన్స్ వద్దే ఆగిపోయి 20 పరుగుల తేడాతో పరాజయం పాలైంది.
తడబడ్డ భారత టాప్ ఆర్డర్
బ్యాటర్లు తడబడ్డ వేళ టీమిండియా ఆశించిన స్కోరు చేయలేకపోయింది. ఆస్ట్రేలియా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో జైస్వాల్ మినహా టాప్ ఆర్డర్ తడబడింది. యశస్వి జైస్వాల్(37; 28 బంతుల్లో 6×4, 1×6), రుతురాజ్(32; 28 బంతుల్లో 3×4, 1×6) రాణించినా శ్రేయస్(8), సూర్యకుమార్(1) చేతులెత్తేశారు. 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన జట్టును రుతురాజ్, రింకూ సింగ్ ఆదుకున్నారు. ముఖ్యంగా రుతురాజ్ మరీ నిదానంగా బ్యాటింగ్ చేశాడు. 111 స్కోరు వద్ద గైక్వాడ్ అవుటయ్యాక క్రీజులోకి జితేష్ శర్మ.. రింకూతో కలిసి రెచ్చిపోయాడు. రింకూ సింగ్(46; 29 బంతుల్లో 4×4, 2×6), జితేష్(35; 19 బంతుల్లో 1×4, 3×6) రెచ్చిపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. చివర్లో అక్షర్(0), చాహర్(0), బిష్ణోయ్(4) వెంటవెంటనే పెవిలియన్ చేరుకున్నారు. ఆసీస్ బౌలర్లలో ద్వర్షియస్ 3, సంఘా, బెహ్రెండార్ఫ్ రెండేసి చొప్పున, హార్దీ ఒక వికెట్ తీసుకున్నారు.
ఆస్ట్రేలియా కూడా అంతే
ఆసీస్ జట్టులోనూ పెద్దగా ఎవరూ స్టాండింగ్ ఇవ్వలేదు. ట్రావిస్(31), ఫిలిప్(8), మెక్ డెర్మాట్(19), హార్దీ(8), టిమ్ డేవిడ్(19), మాథ్యూ షార్ట్(22) తక్కువ స్కోరుకే ఔటయ్యారు. కెప్టెన్ మాథ్యూ వేడ్(36) పోరాటం చేసినా అప్పటికే టార్గెట్ భారీగా పెరిగిపోయింది. 4 ఓవర్ల స్పెల్ లో 16 పరుగులే ఇచ్చిన అక్షర్.. 3 వికెట్లతో ఆసీస్ వెన్నువిరిచాడు. చాహర్ కు రెండు వికెట్లు దక్కగా.. బిష్ణోయ్, ఆవేశ్ ఖాన్ ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు. అక్షర్ పటేల్ కు ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది. ఈ గెలుపుతో 5 మ్యాచ్ ల సిరీస్ ను టీమిండియా మరో మ్యాచ్ మిగిలి ఉండగానే 3-1తో సొంతం చేసుకుంది.