Published 02 DEC 2023
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయా… అదే జరిగితే పార్టీ నుంచి వెళ్లేదెవరు… వారిని కాపాడుకోవడానికి హస్తం పార్టీ ఎలాంటి ప్లాన్ వేస్తున్నది… అన్న విషయాలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారబోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ మెజారిటీతో అధికారం చేపడుతుందని అన్ని సర్వే సంస్థల ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్న తరుణంలో తమ పార్టీ అభ్యర్థులు ప్రమాదంలో ఉన్నట్లు పొరుగు రాష్ట్రానికి చెందిన నేతలు చెబుతున్నారు. తెలంగాణలో సునాయాసంగా అధికారంలోకి రానున్న దృష్ట్యా తమ పార్టీ అభ్యర్థులు ట్రాప్ కు గురయ్యే ప్రమాదం పొంచి ఉందని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి(Deputy Chief Minister) డీకే శివకుమార్ అన్నారు. హస్తం పార్టీ అభ్యర్థులను ట్రాప్ చేసేందుకు KCR ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి స్వయంగా సంప్రదించినట్లు తమ పార్టీ అభ్యర్థులే చెప్పారని శివకుమార్ ఆరోపించారు. రాష్ట్రంలో ఎలాంటి ఇబ్బందుల్లేకుండా పగ్గాలు చేపట్టబోతున్న సందర్భంగా ఈ పరిణామాలు చోటుచేసుకోవచ్చని అనుమానం వ్యక్తం చేశారు. అయితే గెలిచిన వారిని క్యాంపులకు తరలించే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ రాదని DK చెప్పారు.
కర్ణాటక సంపూర్ణ సహకారం
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నేతలకు కర్ణాటక ప్రభుత్వం అన్ని రకాలుగా సహకారం అందించింది. ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతోపాటు డీకే శివకుమార్ పలు బహిరంగ సభల్లో పాల్గొని కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరారు. రేపు రిజల్ట్స్ రానున్న దృష్ట్యా DK శివకుమార్ చేసిన కామెంట్స్ సంచలనంగా మారుతున్నాయి. ఇది కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడనా లేక నిజంగానే అభ్యర్థులు ట్రాప్ కు గురవుతారా అన్నది అనుమానంగా మారింది.
అదే జరిగితే కింకర్తవ్యం…!
డీకే శివకుమార్ చెప్పిందే నిజమని భావిస్తే మాత్రం అందుకు సైతం హస్తం పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నట్లు స్పష్టమవుతున్నది. గెలిచిన అభ్యర్థుల్ని క్యాంపులకు తరలించే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే సదరు క్యాండిడేట్స్ అందరినీ కర్ణాటక రాష్ట్రానికే తరలించే ఛాన్సెస్ ఉన్నట్లు దీన్ని బట్టి అర్థమవుతున్నది. ఇలా అన్ని ఏర్పాట్లపై దృష్టిసారిస్తూనే తాజాగా శివకుమార్ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ గా మారాయి.