Published 02 Dec 2023
స్ట్రాంగ్ రూమ్(Strong Room)కు తరలించాల్సిన పోస్టల్ బ్యాలెట్ బాక్సులను RDO ఆఫీసులో పెట్టుకోవడం.. విషయాన్ని నిలదీశాక ఆగమేఘాల మీద వాటిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించడం.. బ్యాలెట్ బాక్సులు తరలించేదాకా స్ట్రాంగ్ రూమ్ కు తాళాలు లేకపోవడం.. అసలు వాటికి సీల్ కూడా వేయకపోవడం.. ఇదీ అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ఠగా నిలిచిన అంశాలు. ఈ విషయంపైనే రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో తీవ్ర గందరగోళం చోటుచేసుకుంది. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి సంబంధించి 3,057 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. బ్యాలెట్లు తీసుకున్నాక వాటిని బాక్సుల్లో పెట్టి స్ట్రాంగ్ రూమ్ కు తరలించాలి. ఈ నెల 29 నాటికి వచ్చిన బ్యాలెట్లన్నీ అలాగే పడి ఉన్నాయి తప్పితే వాటిని జాగ్రత్తగా పెట్టాలనే ఆలోచనే మరచిపోయారు అక్కడి అధికారులు.
ఆర్డీవోను నిలదీసిన ఏజెంట్లు…
విషయం తెలుసుకున్న కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్దసంఖ్యలో ఇబ్రహీంపట్నం RDO ఆఫీసుకు చేరుకున్నారు. బ్యాలెట్ బాక్సుల సీల్ తొలగించి ఉండటాన్ని హస్తం పార్టీ శ్రేణులతోపాటు ఇండిపెండెంట్ల తరఫు ఏజెంట్లు ఆందోళనకు దిగారు. దీంతో తేరుకున్న అధికారులు హుటాహుటిన ఆ బాక్సుల్ని స్ట్రాంగ్ రూమ్ కు తరలించారు. అసలు విషయమేంటంటే వాటిని స్ట్రాంగ్ రూమ్ కు తరలించేదాకా ఆ స్ట్రాంగ్ రూమ్ కే తాళం లేకపోవడం ఇంట్రెస్టింగ్ గా మార్చింది. జరిగిన ఘటనపై కాంగ్రెస్ సహా స్వతంత్ర అభ్యర్థుల ఏజెంట్లంతా రిటర్నింగ్ అధికారి(RO) అనంతరెడ్డిని గట్టిగా నిలదీశారు.
కలెక్టర్, అబ్జర్వర్ దృష్టి
జరిగిన ఘటనపై కాంగ్రెస్ నేతలు కంప్లయింట్ ఇవ్వడంతో కలెక్టర్ వెంటనే RDO కార్యాలయానికి చేరుకున్నారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు అబ్జర్వర్ సైతం జరిగిన తీరును పరిశీలిస్తున్నారు. రిటర్నింగ్ అధికారితోపాటు స్థానిక సిబ్బందిని కలెక్టర్ విచారణ చేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి మల్ రెడ్డి రాంరెడ్డితోపాటు ఆయన సోదరుడు మల్ రెడ్డి రంగారెడ్డి అక్కడకు చేరుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ నాయకులతో కలెక్టర్ మాట్లాడుతూ వివరాలు అడిగి తెలుసుకున్నారు. గత ఎన్నికల్లోనూ ఇలాంటి తీరు వల్లే మల్ రెడ్డి రంగారెడ్డి స్వల్ప ఓట్లతో ఓటమి పాలయ్యారు. దీంతో ఈసారి కావాలనే అలా చేస్తున్నారంటూ కాంగ్రెస్ శ్రేణులు పెద్దయెత్తున ఆందోళన కొనసాగించాయి.