Published 03 Dec 2023
మూడో తారీఖు…
మూడు పార్టీల్లోనూ ఒకటే ఉత్కంఠ…
మూడు రోజులుగా నిద్రలేని రాత్రులు…
ఇలా డిసెంబరు మూడో తేదీ రాష్ట్రంలో విపరీతమైన ఆసక్తిర అంశంగా మారింది. తెలంగాణ ఎన్నికల ఫలితాలు(Election Results) వెల్లడి కానున్న దృష్ట్యా మూడు ప్రధాన పార్టీల్లో ఒకటే ఉత్కంఠ ఏర్పడింది. రెండు పార్టీల్లో అధికారం కోసం… మూడో పార్టీలో ఆధిక్యం కోసం… ఇలా ముక్కోణపు పోరులో హోరాహోరీ పోరు తప్పదన్న పరిస్థితుల్లో అందరిలోనూ ఒకటే ఆసక్తి నెలకొంది. మరి ఈ రోజు బయటపడే రిజల్ట్స్ ద్వారా తెలంగాణ ప్రజలు ఎవరిని మురిపిస్తారు, మరెవరిని మరిపిస్తారు అన్న సందేహాలు గత కొద్ది రోజులుగా విపరీతమైన రీతిలో చర్చనీయాంశంగా మారాయి. ఈ ఎన్నికల్లో గెలిచే పార్టీ మాత్రం ప్రజల్లోకి బలంగా వెళ్లిపోయినట్లే భావించాల్సి ఉండగా.. ఓడిపోయిన పార్టీకి భవిష్యత్తులో ఇబ్బందులు తప్పకపోవచ్చన్న అభిప్రాయాలు నెలకొన్నాయి. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎలా ఉన్నా అధికారం తమదంటే తమదని చెప్పుకుంటున్న BRS, కాంగ్రెస్… ఇప్పటికీ పూర్తి స్థాయి మెజారిటీ సాధిస్తామన్న కచ్చితమైన నమ్మకంతో కనిపించడం లేదన్న భావన అంతటా కనిపిస్తున్నది.
ఇక అంతా రెడీ…
భారత్ లో నిర్వహించిన మొన్నటి వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ దేశాన్ని ఎంతటి యాంగ్జయిటీలోకి నెట్టిందో ఈ తెలంగాణ ఫలితాలు కూడా అదే స్థాయిలో రాష్ట్ర ప్రజలను అంతటి ఉత్కంఠకు గురి చేస్తూనే ఉన్నాయి. ఓటు వేసింది ఒకరికైతే బయట కనపడుతున్న పరిస్థితి మరోటి అన్న చందంగా తయారైంది వ్యవహారం. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి మెజారిటీ తప్పదని సర్వే సంస్థలు స్పష్టం చేసినా.. 75కు పైగా స్థానాలతో మూడోసారి అధికారంలోకి వస్తామన్న ధీమాను భారత్ రాష్ట్ర సమితి కనబరుస్తోంది. పోలింగ్ జరిగిన సాయంత్రం దాకా అధికార పగ్గాలపై పూర్తి క్లారిటీతో ఉన్న హస్తం పార్టీ లీడర్లు.. తమదే అధికారమంటూ KCR, KTR చేసిన కామెంట్స్ తో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడిపోయారన్న సందేహాలు ఓటర్లలో కనిపించాయి. అందుకే ఈ రెండు పార్టీల నేతలంతా నిన్న కీలక సమావేశాలు నిర్వహించారు. పార్టీ నేతలతో BRS అగ్రనేతలు, కాంగ్రెస్ రాష్ట్ర నేతలతో రాహుల్ జూమ్ మీటింగ్.. ఇలా ఎవరికి వారే అధికారం చేజిక్కించుకుంటే ఎలా అన్న దానిపైనే ప్రధానంగా చర్చించుకున్నారు.
బీజేపీ గ్రాఫ్ నిజంగానే పెరిగిందా…
పాలనా పగ్గాల విషయంలో BRS, కాంగ్రెస్ పరిస్థితి ఇలా ఉంటే ఇక భారతీయ జనతా పార్టీకి సంబంధించి భిన్నమైన అభిప్రాయాలు వినపడుతున్నాయి. ఆ పార్టీ 4-8 స్థానాలకు పరిమితమవుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టం చేస్తున్నా ఓటర్లు పెద్దగా నమ్మలేని స్థితిలో ఉన్నారు. సీట్లు ఎన్ని గెలుస్తారో తెలియదు కానీ ఈసారి కమలం పార్టీకి ఓటింగ్ శాతం బాగా పెరుగుతుందని.. బీసీ, ఎస్సీ, ఇతర వెనుకబడ్డ వర్గాల వారంతా మోదీ వెంటే ఉన్నారన్న కచ్చితమైన నమ్మకంతో ఉన్నారు. జిల్లాల్లో జరిగిన పోలింగ్ సరళిని లెక్కబెట్టుకుంటూ ఇక్కడ BJP అభ్యర్థికి మంచి అవకాశాలున్నాయని, అక్కడ తప్పక గెలుస్తారని అంటూ చర్చించుకున్నారు. దక్షిణ తెలంగాణలో కమలం పార్టీ ప్రభావం చూపే పరిస్థితి లేకున్నా.. ఉత్తర తెలంగాణలో మాత్రం ఊహించని సీట్లు వస్తాయన్న ఆశతో ఉన్నారు. ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో ఊహించని రీతిలో… మెదక్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో ఒకటి రెండు సీట్లు వస్తాయన్న భరోసాతో కనిపిస్తున్నారు. తమకు తామే లెక్కలు కట్టుకుంటూ మొత్తంగా కమలం పార్టీకి 10-15 దాకా రావొచ్చని అంచనా వేసుకున్నారు. ఇంకొందరు మరో అడుగు ముందుకేసి ఆ సంఖ్య ఇంకా ఎక్కువే ఉంటుందని నమ్ముతున్నారు.
పార్టీల కేడర్ కన్నా ప్రజల్లోనే చర్చ
ఇలా మూడు పార్టీల కేడర్ కన్నా మించి ఇప్పుడు రాష్ట్రంలోని సాధారణ ప్రజానీకానికే ఎన్నికలపై తీవ్రమైన ఆసక్తి, ఉత్కంఠ ఏర్పడ్డాయి. గెలిచిన పార్టీని మాత్రం మూడో తేదీ మురిపించనుండగా.. ఓడిన పార్టీని ఇక మరిపించడమే అన్న తరువాయి కనపడుతున్నది. మరి ఏం జరుగుతుందో సాయంత్రం వరకు వెయిట్ చేయాల్సిందే.