రాష్ట్రవ్యాప్తంగా తమ పార్టీ అభ్యర్థుల్ని గెలిపించేందుకు తనను చూసి ఓటేయాలని బహిరంగ సభల్లో పిలుపునిచ్చిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు.. తాను పోటీ చేసిన నియోజకవర్గాల్లోనే భిన్నమైన తీర్పులు వచ్చాయి. ఊహించని రీతిలో ప్రజలు ఆయనకు ఈ తీర్పుని అందజేశారు. రెండు స్థానాల నుంచి పోటీచేసి కామారెడ్డిలో ఓటమి పాలైన KCR.. ఎట్టకేలకు తన పాత స్థానమైన గజ్వేల్ నుంచే గెలుపును సొంతం చేసుకున్నారు. BJP అభ్యర్థి ఈటల రాజేందర్ పై ఆయన 34,000 ఓట్ల మెజారిటీ సాధించారు. కామారెడ్డిలో ఇప్పటికే ఓటమిని మూటగట్టుకుని రెండో స్థానంలో నిలిచిన ఆయన గజ్వేల్ లో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారోనన్నది క్వశ్చన్ మార్క్ గా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన గెలుపొందడంతో కేసీఆర్ కు ఈ ఎన్నికల్లో చిత్రమైన పరిస్థితి ఏర్పడిందని చెప్పవచ్చు.
ముఖ్యమంత్రిని ఓడించేందుకంటూ PCC అధ్యక్షుడు రేవంత్ రెడ్డి సైతం కామారెడ్డి నుంచి రెండో నామినేషన్ వేశారు. దీంతో అక్కడ హోరాహోరీగా తప్పదని అంతా భావించారు. అనుకున్నట్లుగా తొలి ఐదు రౌండ్లలో ఆధిక్యం సాధించిన రేవంత్ రెడ్డిని.. తర్వాతి రౌండ్లలో కమలం పార్టీ క్యాండిడేట్ వెంకటరమణారెడ్డి వెనక్కు నెడుతూ వచ్చారు. చివరకు కేసీఆర్, రేవంత్ రెడ్డిని ఓడిస్తూ సంచలన గెలుపును అందుకున్నారు.