Published 03 Dec 2023
వరల్డ్ కప్ ను ఏ జట్టుకు చేజార్చుకుందో అదే టీమ్ పై టీమిండియా(Team India) ప్రతీకారం తీర్చుకుంది. 5 మ్యాచ్ ల సిరీస్ ను తిరుగులేని రీతిలో 4-1 తేడాతో ఎగరేసుకుపోయింది. చివరి ఓవర్ వరకు తీవ్ర ఉత్కంఠ నెలకొన్న మ్యాచ్ లో అర్షదీప్ అద్భుత బౌలింగ్ తో గెలుపును భారత్ సొంతం చేసుకుంది. బెంగళూరులో జరిగిన చివరి టీ20 మ్యాచ్ లో మరోసారి టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్.. 8 వికెట్లకు 160 పరుగులే చేసింది. నార్మల్ టార్గెట్ తోనే బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఫస్ట్ పవర్ ప్లేలో భారత బౌలర్లను కంగారు పెట్టింది. కానీ తడబడని టీమిండియా కుర్రాళ్లు.. ప్రత్యర్థిని 8 వికెట్లకు 154 పరుగుల వద్ద కట్టడి చేసి 6 పరుగుల తేడాతో విజయాన్ని అందుకున్నారు.
భారత టాప్ ఆర్డర్ ఫెయిల్యూర్
నాలుగో టీ20 మాదిరిగానే ఈ మ్యాచ్ లోనూ భారత టాప్ ఆర్డర్ టపటపా నేలకూలింది. జైస్వాల్(21), రుతురాజ్(10) మరోసారి నిరాశపరిచారు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన అయ్యర్(53; 37 బంతుల్లో 5×4, 2×6) నిలకడగా ఆడుతున్నా మరో ఎండ్ లో సూర్యకుమార్(5), రింకూసింగ్(6) వెంటవెంటనే ఔటయ్యారు. జితేష్ శర్మ(24), అక్షర్(31; 21 బంతుల్లో 2×4, 1×6) సహకారం అందించడంతో భారత్ ఆ మాత్రమైనా స్కోరు చేసింది. ఆసీస్ బౌలర్లలో ద్వారుషిస్, బెహ్రెండార్ఫ్ తలో రెండు వికెట్లు తీస్తే హార్దీ, సంఘా, ఎలిస్ ఒక్కోటి ఖాతాలో వేసుకున్నారు.
ఆస్ట్రేలియా కూడా అంతే
తొలి ఓవర్లోనే 14 రన్స్ చేయడంతో ఆసీస్ గెలుపు ఈజీ అనుకున్నారు. 4 ఓవర్లలో 40 దాటడం, ట్రావిస్ క్రీజులో ఉండటంతో టార్గెట్ రీచ్ చేస్తారనిపించింది. కానీ సూపర్ బాల్ తో హెడ్(28)ను బిష్ణోయ్ ఔట్ చేయడం మరో ఓవర్లోనూ హార్దీ(6)ని అతడే వెనక్కు పంపడంతో 58 స్కోరుకే 3 వికెట్లు పడ్డాయి. అలాంటి స్థితిలో మెక్ డెర్మాట్(54; 36 బంతుల్లో 5×6) ధాటిగా ఆడాడు. అయితే డేవిడ్(17), షార్ట్(16), వేడ్(22) నిలవలేకపోయారు. లాస్ట్ ఓవర్లో 10 రన్స్ అవసరం కాగా తొలి రెండు బంతులకు రన్స్ తీయలేని వేడ్.. మూడో బంతికి దొరికిపోయాడు. 3 బాల్స్ లో 7 రన్స్ చేయాల్సిన దశలో ప్రతి బాల్ కు సింగిల్ మాత్రమే రావడంతో ఆసీస్ కథ ముగించాడు అర్షదీప్. ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా అక్షర్, ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’గా బిష్ణోయ్ నిలిచారు.