Published 04 Dec 2023
ఇప్పటికే ఉత్తరప్రదేశ్ లో యోగి అయిన సీఎం ఆదిత్యనాథ్..
మరి ఇంకో రాష్ట్రంలోనూ మరో యోగి రాబోతున్నాడా..
రాజస్థాన్ లో గెలిచిన BJP దీనిపైనే దృష్టిపెట్టిందా…
అంటే… అవుననే సంకేతాలే వస్తున్నాయి. రాజస్థాన్ ఎన్నికల్లో విజయదుందుభి మోగించిన కమలం పార్టీ ఇప్పుడు ముఖ్యమంత్రిగా కొత్త పేరును తెరపైకి తెచ్చినట్లే కనపడుతున్నది. అదే జరిగితే అతి త్వరలోనే మరో యోగి బాబా.. రాష్ట్ర పగ్గాలు చేపడతారు. ఇప్పటికే ముఖ్యమంత్రి రేసులో మాజీ CM వసుంధరా రాజే, కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మరో బాబా పేరు ప్రముఖంగా వినపడుతోంది. యోగి బాబా బాలక్ నాథ్ కూడా ముగ్గురి పేర్లలో ఒకటిగా మారింది. రాజస్థాన్ లో 115 స్థానాలు గెలిచిన BJP.. కాంగ్రెస్ ను 69 సీట్లకే పరిమితం అధికారం చేపట్టనుంది. దీంతో త్వరలోనే ముఖ్యమంత్రిని ఎన్నుకోవాల్సి ఉండగా ఇద్దరు సీనియర్లతోపాటు ఈ యోగి బాలక్ నాథ్ పేరు కూడా బాగా వినిపిస్తున్నది.
యోగి బాలక్ నాథ్ ఎవరు…!
అల్వార్ నుంచి పార్లమెంటు సభ్యుడిగా కొనసాగుతున్న 40 ఏళ్ల యోగి బాలక్ నాథ్.. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఆరేళ్ల వయసులోనే సన్యాసం స్వీకరించారు. ఇంటి నుంచి వెళ్లిపోయి ఆశ్రమంలోనే గడిపారు. తిజారా సెగ్మెంట్ నుంచి గెలిచిన బాలక్ నాథ్ సైతం ముఖ్యమంత్రి పదవి రేసులో కొనసాగుతున్నారు. ఎంపీగా ప్రజాసేవలో సంతోషంగా ఉన్నానన్న యోగి బాలక్ నాథ్.. పార్టీ ఆదేశిస్తే దేనికైనా రెడీ అంటున్నారు. కొసమెరుపేంటంటే… CM యోగి ఆదిత్య లాగానే బాలక్ సైతం ‘నాథ్’ సామాజికవర్గం(Community) నుంచే వచ్చారు.