Published 04 Dec 2023
పదేళ్ల నుంచి అధికారంలో ఉన్న పార్టీ అది. ఈ దశాబ్ద కాలంలో ఆ పార్టీ దరిదాపుల్లోకి వచ్చిన జెండా మరొకటి లేదు. ఇన్నాళ్లూ పార్టీని, శ్రేణుల్ని ఒంటిచేత్తో నడిపించిన అధినేతను చూడగానే ఒక్కసారిగా వారిలో భావోద్వేగం బయటకు వచ్చింది. ఇంకేముంది అక్కడ అందరి మనసులు భారంగా మారిపోయాయి. ఇదీ ఎర్రవల్లిలోని KCR ఫామ్ హౌజ్ లో కనిపించిన దృశ్యం. BRS తాజా, మాజీ MLAలంతా సిద్దిపేట జిల్లా మర్కూక్ మండలం ఎర్రవెల్లిలోని ఫామ్ హౌజ్ కు చేరుకున్నారు. నిన్ననే కేసీఆర్ రాజీనామా లేఖను పంపడం, దాన్ని గవర్నర్ ఆమోదించడం, కొత్త ప్రభుత్వం ఏర్పాటయ్యేదాకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని సూచించడంతో అందుకు అంగీకరిస్తూనే ఆయన నేరుగా ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు.
అధినేత మాటలతో…
అక్కడ తమ అధినేతను చూడగానే పార్టీ నేతలంతా భావోద్వేగానికి గురయ్యారు. అయితే కొత్త ప్రభుత్వానికి సహకరిద్దామని, ఎన్నికల ఫలితాలపై సమీక్షించేందుకు త్వరలోనే తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించుకుందామని ముఖ్యమంత్రి వారికి తెలిపారు. ఈ సందర్భంలోనే పలువురు నేతలు కళ్ల వెంట నీళ్లు తెచ్చుకున్నారు. గజ్వేల్ నుంచి ఎన్నికైన సర్టిఫికెట్ ను కేసీఆర్ కు వంటేరు ప్రతాపరెడ్డి అందజేశారు. హరీశ్ రావు, కేటీఆర్, పల్లా రాజేశ్వర్ రెడ్డి, కడియం శ్రీహరి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, జగదీశ్ రెడ్డి, తలసాని శ్రీనివాసయాదవ్ సహా పలువురు ఎమ్మెల్యేలు కేసీఆర్ ను కలిసిన వారిలో ఉన్నారు.