Published 05 DEC 2023
పదేళ్లుగా అధికారంలో ఉన్న కమలం పార్టీని గద్దె దింపేందుకంటూ జట్టు కట్టిన విపక్షాల కూటమి ఇండియా అలయెన్స్(India Alliance).. అస్తవ్యస్థంగా తయారైంది. కూటమికి పెద్దన్నగా వ్యవహరించాల్సిన కాంగ్రెస్ ఒంటెద్దు పోకడలతో వెళ్తోందని ప్రధాన పార్టీలు విమర్శిస్తున్నాయి. ఈనెల 6న జరగాల్సిన సమావేశానికి డుమ్మా కొడుతున్నట్లు మూడు మెయిన్ పార్టీలు ప్రకటించాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలతోనే ఇండియా కూటమిలో విభేదాలు మొదలు కాలేదు. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్ గఢ్, మిజోరాం, తెలంగాణలో జరిగిన ఎన్నికలకు మిత్రపక్షాలను పూర్తిగా దూరం పెట్టిన హస్తం పార్టీ.. అన్ని చోట్లా సొంత అభ్యర్థులను నిలబెట్టింది. దీంతో ఆ పార్టీ 4 రాష్ట్రాల్లో తుడిచిపెట్టుకుపోయిందని, ముఖ్యంగా ఛత్తీస్ గఢ్ లో వస్తుందనుకున్న అధికారం కూడా దక్కకుండా పోయిందని విమర్శిస్తున్నాయి.
అసలేం జరుగుతోంది..
ఈ నెల 6న ఇండియా కూటమి పక్షాలతో సమావేశం నిర్వహించేందుకు గాను భాగస్వామ్య పార్టీలకు AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఫోన్ చేశారు. దీనిపై కూటమి నేతలు ఏ మాత్రం ఇంట్రెస్ట్ చూపలేదు. తాజా ఫలితాలను చూశాకైనా కాంగ్రెస్ తో జత కడితే రానున్న ఎన్నికల్లో తమకూ ఇలాంటి తీర్పే ఎదురయ్యే ప్రమాదం ఉందన్న భావన కనిపిస్తోంది. బిహార్ సీఎం నితీశ్ కుమార్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ, సమాజ్ వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్ ఈ భేటీకి రావట్లేదని ఆయా పార్టీలే స్వయంగా ప్రకటించాయి. ఇవన్నీ కాంగ్రెస్ పట్ల ఉన్న అసంతృప్తిని బయటకు తెస్తున్నట్లే ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. ఇండియా కూటమి ఫస్ట్ మీటింగ్ ను పట్నాలో నిర్వహించిన నితీశ్ సైతం ఈ భేటీ పట్ల ఆసక్తి చూపట్లేదు. కాంగ్రెస్ తో వెళ్తే పార్లమెంటు ఎన్నికల్లోనూ ఇదే గతి పట్టవచ్చంటున్న JD(U) అధ్యక్షుడు లలన్ సింగ్.. కూటమి బాధ్యతల్ని నితీశ్ కు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు.
అత్యుత్సాహంతో మునిగారన్న భావన..
కర్ణాటక తరహాలో గెలుస్తామన్న అత్యుత్సాహంతో ఈ ఐదు రాష్ట్రాల్లో ఒంటరిగా పోటీ చేసి పరాజయం కొని తెచ్చుకుంది కాంగ్రెస్. ఓట్లు చీలడం వల్లే హస్తం పార్టీ ఘోరంగా ఓడిపోయిందని విమర్శలు రాగా, ఏకపక్షంగా వెళ్తే ఇలాగే ఉంటుందని మమత బెనర్జీ విమర్శించారు. 2024లో సీట్ల సర్దుబాటుతో వెళ్తేనే BJPని ఓడిస్తామన్న ఆమె.. ఈనెల 6న జరిగే భేటీకి రావట్లేదని కరాఖండీగా చెప్పేశారు. ముందుగా సమాచారం లేనందువల్లే ఇలా చేయాల్సి వస్తుందన్నారు. ఇక మధ్యప్రదేశ్ సీట్లపై ఎస్పీ-కాంగ్రెస్ మధ్య పొసగకపోవడం, హస్తం పార్టీ అన్ని స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడంపై అఖిలేశ్ ఆగ్రహంతో ఉన్నారు. ఈ ప్రభావం సార్వత్రిక ఎన్నికల్లోనూ ఉంటుందన్న భావనతోనే అఖిలేశ్ ఈ మీటింగ్ కు రావట్లేదన్న ప్రచారం జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకంగా తయారైంది.