Published 06 DEC 2023
టెక్నాలజీని దుర్వినియోగం చేస్తూ మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్న వారిపై చర్యలు తీసుకునేలా కేంద్రం(Union Govt) తన పని మొదలుపెట్టింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో ముఖాల్ని మార్చి హీరోయిన్ల ఫేస్ లతో అసభ్యకర వీడియోల్ని వైరల్ చేస్తున్న వారి పట్ల కఠినంగా ఉండాలని నిర్ణయించింది. కేంద్ర ఐటీ, టెలి కమ్యూనికేషన్ల శాఖ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఇందుకోసం ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. డీప్ ఫేక్ వీడియోలు, తప్పుడు సమాచారంపై వివిధ డిపార్ట్ మెంట్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. సోషల్ మీడియా సంస్థలు సైతం ఈ మీటింగ్ కు అటెండ్ కాగా.. కొత్తగా తీసుకురాబోతున్న చట్టానికి సామాజిక మాధ్యమాలన్నీ 100 శాతం కట్టుబడాల్సిందేనని స్పష్టం చేశారు. ఆన్ లైన్ కస్టమర్ల భద్రత, నమ్మకాలకు సంబంధించి IT నిబంధనల్ని సవరిస్తూ కొత్త చట్టానికి రూపకల్పన చేస్తున్నారు.
బాధితులుగా రష్మిక, కాజోల్
హీరోయిన్ రష్మిక మంధాన, బాలీవుడ్ సీనియర్ నటి కాజోల్ సైబర్ క్రైమ్ బారిన పడ్డారు. వీరి ఫేస్ లను AI ద్వారా మార్ఫింగ్ చేసిన డీప్ ఫేక్ వీడియోలు కొద్ది రోజుల నుంచి వైరల్ గా మారాయి. నల్లటి యోగా బాడీసూట్ ధరించిన మహిళ.. కెమెరా కోసం నవ్వుతూ ఎలివేటర్ లోకి ఎంటర్ అయిన సమయంలో తీసిన వీడియోను రష్మిక ఫేస్ తో మార్ఫింగ్ చేశారు. దీనిపై ఆవేదన వ్యక్తం చేస్తూ ఆమె ట్విటర్(X)లో పోస్టులు పెట్టారు. బిగ్ బీ అమితాబ్ బచ్చన్ తోపాటు పలువురు స్పందించి ఆమెకు సపోర్ట్ ఇచ్చారు. అచ్చంగా కాజోల్ కూడా దుస్తులు మార్చుకుంటున్నట్లు డీప్ ఫేక్ వీడియో సృష్టించి సోషల్ మీడియాలో పెట్టారు. ఇలాంటి పోస్టులపై సీరియస్ గా ఉన్న కేంద్ర ప్రభుత్వం నూతన చట్టం దిశగా చర్యలు చేపట్టింది.