Published 06 DEC 2023
రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల కోలాహలం ముగిసి మూడు రోజులైంది. రేపు కొత్త ప్రభుత్వం కొలువుదీరుతున్న దశలో రాష్ట్రంలో మరోసారి ఎలక్షన్ల పండుగ రాబోతున్నది. దీంతో రెండు నెలల వ్యవధిలోనే జరిపే రెండో ఎన్నికలు(Another Elections) గ్రామీణ ప్రాంతాల్లో సందడి చేయబోతున్నాయి. మూడు నెలల్లో గ్రామ పంచాయతీల పదవీకాలం ముగిసిపోతుండటంతో వాటిని నిర్వహించాల్సి ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. 2019 జనవరిలో పల్లెల్లో ఎలక్షన్లు జరగ్గా వారి పదవీకాలం 2024 ఫిబ్రవరి 1 నాడు ముగియబోతున్నది. దీంతో అతి త్వరలోనే పల్లెలకు కొత్త సర్పంచులు, వార్డు సభ్యులు కొలువుదీరబోతున్నారు.
ఫిబ్రవరిలోపు పాలకవర్గాలు
ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ నిర్వహించి వచ్చే ఫిబ్రవరిలోపు పాలక వర్గాలను ఎన్నుకోవాల్సి ఉంది. ఈ మేరకు అన్ని జిల్లాల కలెక్టర్లు సిద్ధంగా ఉండాలంటూ ఆదేశాలు కూడా వెలువడినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ఎన్నికల మాదిరిగానే ‘Te-Poll’ యాప్ ద్వారా ఎన్నికల సిబ్బందిని మానిటరింగ్ చేయబోతున్నారు. 200 ఓటర్లకు ఒక ప్రిసైడింగ్ ఆఫీసర్, పోలింగ్ ఆఫీసర్ ఉంటారు. 201 నుంచి 400 ఓటర్లకు ప్రిసైడింగ్ ఆఫీసర్, ఇద్దరు పోలింగ్ ఆఫీసర్లు ఉండగా.. ఆ సంఖ్య 401 నుంచి 650గా ఉంటే మాత్రం POల సంఖ్య మూడుకు చేరుకుంటుంది. ప్రతి జిల్లాలో మూడు దశ(Thred Phases)ల్లో ఓటింగ్ నిర్వహించబోతున్నారు.