
Published 07 Dec 2023
తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వంపై ఎంతోమందిలో ఎన్నో ఆశలు కనపడుతున్నాయి. ఇది నిజంగానే ప్రజా ప్రభుత్వమంటూ రేవంత్ రెడ్డి ప్రకటన చేసినప్పటి నుంచీ ఆ ఆశలు మరింత పెరిగాయి. సామాన్యులు, నిరుద్యోగులు, ఉద్యోగులు ఇలా అన్ని వర్గాల్లోనూ ఏదో కొత్తగా జరగబోతుందన్న ఉత్సాహం పెద్దయెత్తున కనిపిస్తున్నది. అయితే అత్యంత దారుణమైన విషయమేంటంటే… కొత్త రాష్ట్రమేర్పడితే తమకు మంచి స్థానం దక్కుతుందని భావించిన చాలా మంది అధికారులకు కనీస గుర్తింపు లేకుండా మూలన(Loop Line) పడి ఉన్నారు. ఉన్నతస్థాయి నుంచి సాధారణ డిపార్ట్మెంట్ల దాకా ఆయా శాఖల్లో నిజాయతీపరులైన అధికారులు కూడా ఉన్నారు. ఎవరెవరికో కీలక పోస్టింగ్ లు ఇచ్చి సమర్థులుగా బాధ్యతలు నిర్వర్తించే దమ్మున్న వారిని కనీసం ప్రజలకు పేరు కూడా తెలియని రీతిలో ఓ పక్కకు పడేశారు. ఇలా గత పదేళ్లలో లోలోపలే మథనపడుతున్న అధికార గణానికి లెక్క లేదనే చెప్పాలి. ఇలాంటి వారంతా ఇప్పుడు రేవంత్ సర్కారులో మళ్లీ గుర్తింపు దక్కుతుందని ఆరాటపడుతున్నారు.
అధికార వ్యవస్థలు అతలాకుతలం…
రాష్ట్రంలో ఒక MLA చెప్పిన వ్యక్తులకే ఆ నియోజకవర్గంలో అధికారులకు పోస్టింగ్ లు దక్కాయన్న ఆరోపణలు, వాస్తవాలు జోరుగా ఉన్నాయి. డివిజనల్ స్థాయి అధికారులకు కూడా MLA లెటర్లు అవసరమవుతున్నాయి అన్న చెడ్డపేరు ఉంది. దీన్నిబట్టే నియోజకవర్గ ప్రజాప్రతినిధుల డామినేషన్ ఏ విధంగా సాగిందో అర్థమవుతుంది. దీన్ని ఆసరాగా చేసుకున్న ఎందరో అక్రమార్కులు(చిన్న ఉద్యోగుల నుంచి బ్యూరోక్రాట్ల దాకా) వ్యవస్థని ఛిన్నాభిన్నం చేశారు. సెటిల్మెంట్లు, వివాదాలు, తప్పుడు పద్ధతుల ద్వారా కోట్లకు పడగలెత్తిన అధికారులు ఉన్నారు. ఒక IAS, IPSకి తన జీవిత కాలంలోనే కలెక్టర్, ఎస్పీ పోస్టింగ్ అనేది అత్యంత కీలకం, గౌరవం. అదే రీతిలో SI, CIలు కూడా SHO(Station House Officer) బాధ్యతల్ని కూడా అలాగే భావిస్తారు. కానీ రాష్ట్రంలో ఆ పదవి దక్కని సివిల్ సర్వెంట్లు, సాధారణ స్థాయిలో అత్యంత నిబద్ధత గల అధికారులు ఎంతోమంది ఉన్నారు. అడ్డదిడ్డంగా, పైరవీలతో మాత్రమే పోస్టింగ్ లు దక్కడంతో ఆడింది ఆట, పాడింది పాటగా తయారైందన్న అపవాదు రాష్ట్రానికి వచ్చింది.
ఆ మాట అనకండ్రా బాబు…
తెలంగాణలో ఒక పదం బాగా వినపడుతుంటుంది. దేశంలోనే మన శాఖల్లో ఒక వ్యవస్థ అత్యుత్తమం అన్న మాటలు ఉన్నాయి. దీనిపై ఓ రాష్ట్రస్థాయి ఉన్నతాధికారి మాటల్లోనే వింటే… ‘దేశంలో బెస్ట్ అంటూ మనకు మనమే పరువు తీసుకుంటున్నాం.. ఒక MLA లెటర్ ఇస్తే గానీ పోస్టింగ్ లు లేని రాష్ట్రంలో మేమే బెస్ట్ అని జబ్బలు చరచుకోవడం సిగ్గుచేటు.. సరే అక్రమంగా చేసేదేదో చేస్తూనే ఉన్నారు.. ఇలా రాష్ట్రం పరువు తీస్తున్న పరిస్థితులున్న వేళ ఇకనైనా దేశంలో మేమే బెస్ట్ అన్న పదం వాడకండ్రా బాబూ’ అంటూ రాష్ట్రస్థాయిలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన బ్యూరోక్రాట్ అన్నారంటేనే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థమవుతుంది. ఈ సర్కారుకు మంచి పేరు రావాలంటే మాత్రం.. జిల్లాలు, కమిషనరేట్ల పరిధిలో బాధ్యతగా పనిచేసే అధికారులకే కీలక పోస్టింగ్ లు దక్కాలి. మొన్నటివరకు రేవంత్ ను ఏ మాత్రం లెక్కచేయని అధికారులు.. ఇప్పుడాయన CM కాబట్టి అప్పుడే ‘బాకా ఊదడం’ ప్రారంభించేశారు. ఇచ్చిన మాట ప్రకారం దివ్యాంగురాలు రజనీకి ఉద్యోగం ఇస్తూ తొలి సంతకం చేయబోతున్నారు రేవంత్. ఇకనైనా మాలాంటి వాళ్లపై దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందంటున్నారు లూప్ లైన్ అధికారులు. మరి కొత్త CM ఏం చేస్తారో చూడాలి.