Published 08 Dec 2023
మాజీ ముఖ్యమంత్రి, BRS అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారు. అర్థరాత్రి ఆయన హైదరాబాద్ సోమాజిగూడలోని యశోదా హాస్పిటల్ లో చేరారు. కాలు జారి పడటంతో KCRకు తీవ్రంగా గాయాలైనట్లు తెలుస్తోంది. కాలి ఎముక విరిగినట్లు అనుమానిస్తున్న డాక్టర్లు పూర్తిస్థాయిలో వైద్య పరీక్షలు చేస్తున్నారు. 50 ఏళ్లు దాటిన వ్యక్తులకు ఇలా తుంటి ఎముక విరిగితే అందుకోసం ప్రత్యేక టెస్టులు చేయాల్సి ఉంటుంది. దీంతో KCRకు మరికొన్ని రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని డాక్టర్లు అంటున్నారు. ఇందుకు ఆపరేషన్ ఒక్కటే మార్గం కాగా, ఆయన వయసు రీత్యా శస్త్రచికిత్స చేస్తే ఎలా ఉంటుంది.. తట్టుకోగల శక్తి ఉంటుందా అన్న దానిపైనా ఆలోచన చేస్తున్నారు. వీటన్నింటిని పరిశీలించిన తర్వాత ఆయనకు సర్జరీ చేసే అవకాశమున్నట్లు హాస్పిటల్ వర్గాలు చెబుతున్నాయి.
కొద్ది రోజుల క్రితమే ఈ మాజీ ముఖ్యమంత్రి తీవ్ర అనారోగ్యం పాలయ్యారు. 20 రోజులపాటు ఇంటికే పరిమితం కాగా.. ఎన్నికల ప్రచారంలో మళ్లీ బయటకు వచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 100 వరకు సభలకు అటెండ్ అయ్యారు. అయినా ఎన్నికల్లో గులాబీ పార్టీకి పరాజయం తప్పకపోగా, పదవికి రాజీనామా చేసి ఫామ్ హౌజ్ కు వెళ్లిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన కాలు జారి తీవ్రంగా గాయపడటంతో మరోసారి హాస్పిటల్ లో చేరారు.