Published 09 Dec 2023
కేసీఆర్ ప్రభుత్వంలో సలహాదారులు(Government Advisors)గా పనిచేసిన మాజీ ఉన్నతాధికారులకు మంగళం పాడుతూ కొత్త ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రేవంత్ రెడ్డి సర్కారు ఆదేశాల మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో BRS పదేళ్ల పాలనా కాలంలో విధులు నిర్వర్తించిన వారందరినీ ఉన్నట్టుండి తొలగించారు. తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి మొన్నటి వరకు రాష్ట్రంలో కీలక స్థానాల్లో పనిచేసిన ఉన్నతాధికారులు పదవీ విరమణ(Retired) చేయగానే.. మీ సేవలు రాష్ట్రానికి అవసరమంటూ కేసీఆర్ సర్కారు సలహాదారులుగా నియమించింది. ఇందులో ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శులు, డీజీపీ స్థాయి అధికారులు ఉన్నారు.
తొలి సీఎస్ నుంచి అంతా అడ్వయిజర్లే
కొత్త రాష్ట్రానికి తొలి CSగా సేవలందించిన రాజీవ్ శర్మ, డీజీపీగా పనిచేసిన అనురాగ్ శర్మ, DG కేడర్ లో రిటైర్డ్ అయిన మరో ఐపీఎస్ ఎ.కె.ఖాన్, మొన్నటివరకు చీఫ్ సెక్రటరీగా పనిచేసి క్యాట్(Central Administrative Tribunal) ఆదేశాలతో బలవంతంగా ఆంధ్రప్రదేశ్ కేడర్ కు బదిలీ అయిన సోమేశ్ కుమార్ సహా పలువురి అధికారాలను రద్దు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. సోమేశ్ కుమార్ APకి వెళ్లిన వెంటనే అక్కడ ఉండలేక ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంతరం తెలంగాణకు వచ్చిన ఈయనకు కేసీఆర్ సర్కారు సలహాదారు పదవి కట్టబెట్టింది. వీరితోపాటు IFS మాజీ అధికారి ఆర్.శోభ, IES మాజీ అధికారి జి.ఆర్.రెడ్డిలను తొలగిస్తూ రేవంత్ సర్కారు కీలక ఆదేశాలు ఇచ్చింది.
ముందునుంచే మండిపడ్డ ముఖ్యమంత్రి
రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుల నియామకాలు, వారి వ్యవహారశైలి, ప్రభుత్వ పాలనా తీరు, చెల్లిస్తున్న జీతాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతం నుంచీ విమర్శిస్తూనే ఉన్నారు. సలహాదారుల వల్లే ప్రభుత్వం ఇష్టారీతిన నిర్ణయాలు తీసుకుంటోందని, దీంతో విపరీతమైన అక్రమాలు పెరిగిపోతున్నాయని ఆరోపించారు. ఇందుకు కేసీఆర్ సర్కారు ప్రతిష్ఠాత్మక కార్యక్రమమైన ధరణి పథకాన్ని ప్రధానంగా లక్ష్యంగా చేసుకున్నారు. ఏకపక్షంగా తీసుకువచ్చిన ఈ స్కీమ్ వల్ల కలిగే నష్టాలు, ఒక మాజీ CS వల్ల కలుగుతున్న ఇబ్బందులను అన్ని చోట్లా ప్రస్తావించారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆయన అధికారంలోకి రాగానే అందరినీ తొలగించాలని నిర్ణయం తీసుకుని దాన్ని అమలు చేశారు.