Published 10 Dec 2023
నాలుగు సార్లు పార్లమెంటు సభ్యుడిగా, రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గిరిజన నాయకుణ్ని(Tribal Leader) ముఖ్యమంత్రిగా నియమిస్తూ BJP నిర్ణయం తీసుకుంది. ఛత్తీస్ గఢ్ లో అధికార పగ్గాలు చేపట్టనున్న కమలం పార్టీకి విష్ణుదేవ్ సాయ్ నేతృత్వం వహించబోతున్నారు. ప్రధాని మోదీ తొలి కేబినెట్ లో మంత్రిగా సేవలందించిన విష్ణుదేవ్ సాయ్.. ఇప్పుడు రమణ్ సింగ్ ను కాదని ఛత్తీస్ గఢ్ CMగా ప్రమాణస్వీకారం చేస్తున్నారు. రాజధాని రాయ్ పూర్ లోని పార్టీ కార్యాలయంలో సమావేశమైన శాసనసభా పక్షం.. MLAల అభిప్రాయం మేరకు సాయ్ ని ఎంపిక చేశారు. 90 సీట్లు గల అసెంబ్లీలో కమలం పార్టీ ఈ నెల 3న ప్రకటించిన ఫలితాల్లో అనూహ్యంగా 54 సీట్లతో అధికారాన్ని దక్కించుకుంది. గతంలో ఎన్నడూ లేనంత రీతిలో మెజారిటీ సాధించగా.. ఈ విజయం ద్వారా ఎగ్జిట్ పోల్స్ రిజల్ట్స్ అన్నీ తప్పని నిరూపించింది.
ముఖ్యమంత్రిగా ఎన్నికైన విష్ణుదేవ్ కు అపార రాజకీయ అనుభవం ఉంది. నరేంద్ర మోదీ తొలి కేబినెట్ లో ఆయన ఉక్కు, గనుల శాఖ మంత్రిగా పనిచేశారు. ఛత్తీస్ గఢ్ లో ఇంతవరకు BJP గెలవని ప్రాంతాల్లో అభ్యర్థులు విజయాలు సాధించేలా చేయడంతో విష్ణుదేవ్ కు మంచి పేరు వచ్చింది. 2020 నుంచి 2022 వరకు ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా సేవలందించారు. హైకమాండ్ నియమించిన అర్జున్ ముండా, శర్బానంద సోనోవాల్, దుష్యంత్ కుమార్ పరిశీలకుల ఆధ్వర్యంలో విష్ణుదేవ్ సాయ్ ని శాసనసభా పక్షం తమ నేతగా ఎన్నుకుంది.