Published 12 Nov 2023
వచ్చే సంవత్సరం(2024)కు గాను సెలవులను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఆ ఏడాదిలో 27 సాధారణ సెలవులు(General Holidays) ఉండగా, మరో 25 ఐచ్ఛిక సెలవులు(Optional Holidays) ప్రకటిస్తూ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని అన్ని సంస్థలు, కార్యాలయాలకు ఇది వర్తిస్తుందని ఉత్తర్వుల్లో తెలియజేసింది. నూతన సంవత్సరం తొలి రోజు నాడు హాలిడే ప్రకటించినందున ఆ రోజుకు బదులు ఫిబ్రవరి 10న రెండో శనివారం నాడు డ్యూటీ చేయాల్సి ఉంటుంది. ఉద్యోగులకు ఇచ్చిన ఆప్షనల్ హాలిడేస్ ల్లో ప్రతి ఒక్కరూ పండుగలు, వివిధ సందర్భాల్లో ఐదుకు మించకుండా ఐచ్ఛిక సెలవుల్ని వాడుకోవచ్చు.
ఈద్-ఉల్-ఫితర్, ఈద్-ఉల్-అజా, మొహర్రం, ఈద్-ఇ-మిలాద్ వంటి సందర్భాల్లో నెలవంక దర్శనం మేరకు సెలవుల్లో మార్పులు చేర్పులకు అవకాశం ఉన్నందున.. అప్పటికప్పుడు ఆయా తేదీల్ని మార్చుతామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి పేరిట వెలువడిన ఉత్తర్వుల్లో తెలియజేశారు. తేదీ మార్పుపై విభాగాధిపతుల ఆదేశాల కోసం చూడకుండా ఉండేందుకు గాను జిల్లాల కలెక్టర్లకు నిర్ణయాధికారాన్ని అప్పగించారు. జనవరి 1, జనవరి 15న సంక్రాంతి, మార్చి 8న మహాశివరాత్రి, ఏప్రిల్ 11న ఈద్-ఉల్-ఫితర్(రంజాన్), అక్టోబరు 31న దీపావళితోపాటు వివిధ పండుగలు, ప్రత్యేక రోజులకు సెలవులను సర్కారు ప్రకటించింది.