
Published 12 Nov 2023
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC)లో రాజీనామాల పర్వం కొనసాగుతోంది. నిన్న ఛైర్మన్ జనార్దన్ రెడ్డి రాజీనామా చేయగా, ఈరోజు కమిషన్ సభ్యుడు అదే బాటను అనుసరించారు. TSPSC సభ్యుడైన ఆర్.సత్యనారాయణ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తాను ఎలాంటి తప్పు చేయకున్నా పదవీ బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఉందని అన్నారు. ‘నేను ఏ తప్పు చేయలేదు.. అయినా తప్పుకుంటున్నా.. ఇందుకు ప్రధాన కారణం పనిచేసే వాతావరణం లేకపోవడమేనని సత్యనారాయణ గుర్తు చేశారు.
పరీక్షల నిర్వహణలో తీవ్రంగా విఫలమైన TSPSC లీకేజీల విషయంలోనూ తీవ్రమైన విమర్శల పాలైంది. కమిషన్ ను ప్రక్షాళన చేసే లక్ష్యంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం నాడు ఛైర్మన్ జనార్ధన్ రెడ్డిని పిలిపించుకున్నారు. CMను కలిసిన కొద్దిసేపటికే పదవికి రాజీనామా చేస్తున్నట్లు జనార్ధన్ రెడ్డి ప్రకటించారు. ఆ రాజీనామాను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కు పంపి 24 గంటలు గడిచినా ఆమోదం పొందలేదు. గవర్నర్ పుదుచ్చేరిలో ఉన్నందున ఇంకా రాజీనామాను ఆమోదించలేదంటూ రాజ్ భవన్ నుంచి ప్రకటన వచ్చింది. రాజీనామాను ఆమోదించినట్లు వచ్చిన వార్తల్లో నిజం లేదని వివరణ ఇచ్చింది. ఈ విషయంలో ట్విస్ట్ నెలకొనగా కమిషన్ సభ్యుడైన సత్యనారాయణ రాజీనామా చేయడం చర్చకు దారితీసింది.