Published 12 Nov 2023
శాసనసభకు ఎన్నికైన MLAల గ్రూప్ ఫొటోలో ఆయన చివరన నిల్చున్నారు. కానీ ఆయనే అనూహ్యంగా అందరికన్నా ముందు వరుసలో నిలిచి ఆ టీమ్ కు ఆయనే కెప్టెన్ అవ్వాల్సి వచ్చింది. ఇలాంటి విచిత్ర ఘటన రాజస్థాన్ శాసనసభాపక్ష(BJLP) సమావేశంలో కనిపించింది. సంగనేర్ నుంచి తొలిసారి MLAగా గెలిచిన భజన్ లాల్ శర్మ.. ఏకంగా ఆ రాష్ట్ర సీఎం పీఠంపై కూర్చోబోతున్నారు. వసుంధర రాజే, అశ్విని వైష్ణవ్, గజేంద్రసింగ్ షెకావత్, కిరోరి లాల్ మీనా, రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ వంటి సీనియర్లు పోటీపడ్డా చివరకు భజన్ లాల్ వైపే హైకమాండ్ మొగ్గు చూపింది. దియాకుమారి, ప్రేమ్ చంద్ భైరవను డిప్యుటీ CMలుగా ఎంపిక చేయగా.. అందులో దియా కుమారి రాజ్ పుత్ వంశానికి చెందినవారైతే, ప్రేమ్ సింగ్ భైరవ దళిత సామాజికవర్గానికి చెందిన వ్యక్తి.
ఆయన ఎంత చెబితే అంత
భజన్ లాల్ శర్మను మాజీ ముఖ్యమంత్రి వసుంధర రాజే ప్రతిపాదించగా, రాజ్ నాథ్ సింగ్ నేతృత్వంలోని కేంద్ర పరిశీలకుల ఆధ్వర్యంలో శాసనసభాపక్ష నేత ఎన్నిక జరిగింది. 56 ఏళ్ల వయసు గల భజన్ లాల్ ఇప్పటివరకు పార్టీ పదవుల్లోనే కీలకంగా వ్యవహరించారు. భరత్ పూర్ కు చెందిన ఈయన సంగనేర్ నుంచి పోటీ చేసి తొలిసారి MLAగా గెలుపొందారు. ABVP నుంచి వచ్చి నాలుగు సార్లు జనరల్ సెక్రటరీగా ఉన్నారు. బ్రాహ్మణ, రాజ్ పుత్, దళిత వర్గాలకు మూడు ముఖ్యమైన పదవుల్ని BJP కట్టబెట్టింది. 199 స్థానాలు గల రాజస్థాన్ లో BJPకి 115 సీట్లు వచ్చాయి.
మూడు రాష్ట్రాల్లోనూ కొత్తవారే
మూడు రాష్ట్రాల్లో విజయబావుటా ఎగురవేసిన కమలం పార్టీ.. ఆ మూడు చోట్లా ముగ్గురు కొత్త సీఎంలను ఎంపిక చేసింది. రాజస్థాన్ లో భజన్ లాల్, ఛత్తీస్ గఢ్ లో గిరిజన వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయ్, మధ్యప్రదేశ్ లో మోహన్ యాదవ్ కు ముఖ్యమంత్రి బాధ్యతలు కట్టబెడుతూ అనూహ్య నిర్ణయాలు తీసుకుంది. మూడు రాష్ట్రాల్లోనూ మహామహులైన నేతల్ని పక్కనపెట్టి కొత్తవారికి అవకాశం కల్పించింది.