
Published 12 Nov 2023
అనుకున్నట్లుగా TSPSC ప్రక్షాళనకు ప్రభుత్వం సిద్ధమైంది. నిరుద్యోగుల ఆశల్ని నిలబెట్టేలా కమిషన్ ను సంస్కరించాలన్న లక్ష్యంలో భాగంగా పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. యూనియన్ సర్వీస్ కమిషన్(UPSC) తరహాలో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) ఉండాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు TSPSCని పూర్తిగా ప్రక్షాళన చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. ఇక నుంచి నియామకాలు(Recruitments) పారదర్శకంగా ఉండేలా వ్యవస్థ మొత్తాన్ని ప్రక్షాళన చేయాలన్న నిర్ణయానికి వచ్చారు. కమిషన్ వ్యవహారాలపై సమీక్ష నిర్వహించిన రేవంత్.. జరుగుతున్న పరిణామాలపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది.
UPSC విధానంపై అధ్యయనం చేయాలని, అక్కడ అమలు చేస్తున్న పద్ధతుల్ని మన రాష్ట్ర కమిషన్ కు అన్వయించేలా చూడాలని ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. దీనిపై సమగ్ర అధ్యయనం నిర్వహించి తనకు రిపోర్ట్ అందజేయాలన్న ఆయన.. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ మేరకు కమిషన్ ఉండాలన్నదే తమ అభిమతమన్నారు. TSPSC ఛైర్మన్, సభ్యుల నియామకాలు పూర్తి పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.