Published 12 Dec 2023
ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈనెల 17న నిర్వహించాల్సిన పరీక్షల్ని తెలంగాణ స్టేట్ పవర్ జనరేషన్ కార్పొరేషన్ లిమిటెడ్(TSGENCO) వాయిదా వేసింది. ఇతర ఎగ్జామ్స్ ఉన్నందున తమ పరీక్షల్ని వాయిదా వేస్తున్నట్లు ప్రకటించగా.. కొత్త తేదీల్ని త్వరలోనే వెల్లడిస్తామని చెప్పింది. AE, కెమిస్ట్ ఉద్యోగాల నియామకాల కోసం ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసింది. పరీక్షలు వాయిదా పడ్డ దృష్ట్యా మళ్లీ హాల్ టికెట్లను ఇచ్చే అవకాశముంది. TSGENCOలో 339 అసిస్టెంట్ ఇంజినీర్, 60 కెమిస్ట్ పోస్టుల భర్తీకి అక్టోబరు 5న నోటిఫికేషన్ వచ్చింది. అక్టోబరు 7 నుంచి నవంబరు 10 వరకు అప్లికేషన్లు తీసుకోగా.. నవంబరు 14, 15 తేదీల్లో దరఖాస్తుల సవరణలకు అవకాశం కల్పించారు.
ఖాళీల భర్తీకి నియామకాలు
రాష్ట్రంలో కొత్తగా నిర్మాణమవుతున్న యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్కేంద్రాలతోపాటు వివిధ ప్రాంతాల్లో రిక్రూట్మెంట్ల కోసం ఈ నోటిఫికేషన్ ఇచ్చారు. ఉద్యోగాలకు సెలెక్ట్ అయిన వారికి రూ.65,000 నుంచి రూ.1,31,000 చెల్లిస్తారు. AE పోస్టుల్లో ఎలక్ట్రికల్-187, మెకానికల్-77, సివిల్-50, ఎలక్ట్రానిక్స్-25 ఖాళీలుండగా.. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసినవారు పరీక్షకు అర్హులు. మొత్తం 100 మార్కులకు పరీక్ష జరగనుండగా, ఒక్కో ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తున్నారు.