Published 13 Dec 2023
అధికారంలోకి వస్తే ధరణిని పూర్తిస్థాయిలో ప్రక్షాళన చేయడం అవసరమైతే దాన్ని ఎత్తివేస్తామని ప్రకటించిన రేవంత్ రెడ్డి.. పగ్గాలు చేపట్టిన తర్వాత తొలిసారి ఆ పథకంపై సమీక్ష(Review) నిర్వహించారు. రెండు గంటల పాటు ఉన్నతాధికారులతో సుదీర్ఘ రివ్యూ నిర్వహించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. టైటిల్ గ్యారంటీ చట్టం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూ.83 కోట్లు ఏమయ్యాయని ప్రశ్నించిన ముఖ్యమంత్రి.. అవి కూడా స్వాహా చేశారా అంటూ మండిపడినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు దామోదర రాజనర్సింహ, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి రివ్యూ నిర్వహించిన రేవంత్.. గత ప్రభుత్వం అవలంబించిన తీరును వివరంగా అడిగి తెలుసుకున్నారు. ధరణి పోర్టల్ విధానాలపై రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, CCLA(చీఫ్ కమిషనర్ ఆఫ్ ల్యాండ్ అక్విజేషన్) అయిన నవీన్ మిట్టల్ ప్రజంటేషన్ ఇచ్చారు.
20 లక్షల మంది రైతుల అవస్థలు
నిషేధిత జాబితా(Prohibition List), అసైన్డ్ భూములు, పట్టా భూముల వ్యవహారాలపై తనకు రిపోర్ట్ అందజేయాలని ఆదేశించారు. రాష్ట్రవ్యాప్తంగా 20 లక్షల మంది రైతులు ఈ పోర్టల్ వల్ల ఇబ్బందులు పడ్డారన్న ముఖ్యమంత్రి.. చివరకు కేంద్రం ఇచ్చిన నిధుల్ని సైతం మింగేశారా అంటూ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఒకింత వాడీవేడిగా సమావేశం సాగగా… ధరణి పోర్టల్ వెనకున్న తతంగం గురించి సైతం ముఖ్యమంత్రి క్షుణ్నంగా అడిగి తెలుసుకున్నారు. క్షేత్రస్థాయి(Ground Level)లో రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు, లోపభూయిష్టంగా మారిన సాఫ్ట్ వేర్, అధికారుల అనాలోచిత ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇంతటి అక్రమాలు జరిగిన పోర్టల్ ను ఇంతకాలం పొగిడింది ఇందుకేనా అని ప్రశ్నించినట్లు తెలుస్తోంది. భూ సంబంధిత సమస్యల పరిష్కారానికి వెంటనే ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలన్న CM.. గతంలో వేసిన కోనేరు రంగారావు కమిటీ మాదిరిగా ఉండాలని CS శాంతికుమారిని ఆదేశించారు. ఈ కమిటీలో మంత్రులతోపాటు రెవెన్యూ శాఖ ఉన్నతాధికారులు, రైతు ప్రతినిధులు, భూ వ్యవహారాల నిపుణులు ఉండాలని స్పష్టం చేశారు.