Published 14 Nov 2023
హైదరాబాద్ కు ఆభరణంగా మారిన మెట్రో(Metro) మార్గం వల్ల దానికి దగ్గర్లో ఉన్న కాలనీలు, భూములకు అమాంతం విలువ పెరిగింది. ఒకప్పుడు రూ.20-30 లక్షలు పలికిన ఒక ఫ్లాట్.. మెట్రో వచ్చాక 60-70 లక్షలు ఇంకా కొన్నిచోట్ల కోటికి పైగానే ధరకు చేరింది. ఒక్క ఫ్లాట్ విలువే ఇలా ఉంటే ఇక మెట్రోకు ఆనుకుని ఉన్న భూముల రేట్లు ఎలా ఉంటాయో తెలిసిందే. ఇప్పుడు ఈ అంశమే పెద్ద చర్చకు దారితీసి ఏకంగా మెట్రో మార్గాన్నే రద్దు చేశారన్న మాటలు వినపడుతున్నాయి. ఆక్యుపెన్సీ రేషియో(OR) ఆశించిన స్థాయిలో లేకున్నా, ఇప్పటికీ నష్టాల్లోనే కొనసాగుతున్న మెట్రోను మరిన్ని దశలకు విస్తరించాలని గత సర్కారు భావించింది. అందులో రాయదుర్గం-శంషాబాద్ కారిడార్ ను ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని త్వరలోనే పనులు ప్రారంభిస్తామని ప్రకటిస్తే.. రేవంత్ సర్కారు ఏకంగా ఆ లైన్ ను రద్దు చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది.
అదే మెయిన్ రీజన్
శంషాబాద్ మెట్రో అలైన్మెంట్ మార్పునకు కారణం ఆ కారిడార్ వల్ల గత ప్రభుత్వానికి చెందిన దగ్గరి వ్యక్తులకు లాభం చేకూరటమేనట. గత ప్రభుత్వ పెద్దల్లోని కొందరి అండదండలు కలిగిన బడా వ్యాపారులకు రాయదుర్గం-శంషాబాద్ మార్గంలో వందలాది ఎకరాల్లో భూములుండటమే ఈ నిర్ణయానికి కారణమన్న మాటలు వినపడుతున్నాయి. గతంలో రేవంత్ సైతం ఈ అలైన్మెంట్ పై అనుమానాలు వ్యక్తం చేశారు. ఇప్పటికే దీనిపై పూర్తిస్థాయి అధ్యయనం చేసిన ఆయన.. CM అయ్యాక నిన్న రివ్యూ చేశారు. 111 జీవో పరిధిలో తక్కువ అభివృద్ధికి ఆస్కారమున్న ప్రాంతానికి ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్డు(ORR) ఉండటంతో రాయదుర్గం-శంషాబాద్ లైన్ అవసరం లేదన్నది ఈ సర్కారు ఆలోచన. రాయదుర్గం-శంషాబాద్ టెండర్లు నిలిపివేయడంతోపాటు ప్రత్యామ్నాయంగా MGBS-ఫలక్ నుమా, చాంద్రాయణగుట్ట మీదుగా శంషాబాద్ వరకు నిర్మించాలన్నది ప్లాన్. అయితే ఇందులోనూ రెండు మార్గాల్ని పరిశీలించి తక్కువ బడ్జెట్ గల దారినే ఎంచుకోవాలని సీఎం ఆదేశించారు.
నగరం మధ్యలోనుంచి వెళ్తేనే
హైదరాబాద్ జనాభా ఎక్కువగా మహానగరం మధ్యలో ఉందన్నది కాదనలేని వాస్తవం. ఈస్ట్, సెంట్రల్, ఓల్డ్ సిటీ ప్రాంతాల్లో జనసాంద్రత ఎక్కువ. ఈ మార్గాల్లో మెట్రో విస్తరిస్తే OR బాగా పెరగడమే కాకుండా బ్రేక్ ఈవెన్(లాభనష్టాలు లేకుండా) సాధించే అవకాశాలుంటాయి. భవిష్యత్తులో లాభాలకూ ఆస్కారముంది. అదే రాయదుర్గం-శంషాబాద్ మార్గాన్ని తీసుకుంటే కేవలం ఐటీ లేదా అభివృద్ధి చెందిన వ్యక్తులకే పరిమితమవుతుంది. అలా అని శ్రీమంతులంతా మెట్రో ఎక్కుతారనుకున్నా పొరపాటే. సొంత కార్లను విడిచి మెట్రో ఎక్కడం దాదాపు అసాధ్యం. అలాంటి వారికి పనికిరాని మెట్రోను సామాన్యుల దరికి చేర్చితే రెండు రకాలుగా ఉపయోగమున్న దృష్ట్యా గత సర్కారు విధానమైన రాయదుర్గం-శంషాబాద్ రూట్ కరెక్ట్ కాదనేది రేవంత్ సర్కారు ఆలోచనగా ఉంది.
ఆ వ్యాపారులు వారేనా
భాగ్యనగర రియల్ ఎస్టేట్ రంగంలోనే బడా కార్పొరేట్ గా చలామణి అవుతున్న ఒక పెద్ద సంస్థకు రాయదుర్గం-శంషాబాద్ కారిడార్లో భారీగా భూములున్నాయట. ఈ సంస్థకు గత ప్రభుత్వంలోని పెద్దలతో అంతర్గత సంబంధాలున్నాయని అప్పట్లోనే కాంగ్రెస్ పార్టీ అనుమానించింది. నాటి సర్కారులో పనిచేసిన కొందరు వ్యక్తులు సైతం ఇప్పటికే ఈ దారిలో ల్యాండ్స్ కొనేసినట్లు ప్రచారం జరిగింది. నిజానికి రాయదుర్గం నుంచి శంషాబాద్ మధ్యలో ఫ్లైఓవర్లు ఉండటం కూడా అక్కడ మెట్రో వర్కవుట్ కాదనేది కాదనలేని సత్యం. రూ.6,250 కోట్ల మెట్రో లైను పూర్తయితే తమ భూములు కొన్ని వేల కోట్లకు చేరుకుంటాయని సదరు వ్యాపారులు ఆశలు పెట్టుకున్నారు. అలాంటి అక్రమార్కుల ఆశల్ని అడియాసలు చేస్తూ రేవంత్ సర్కారు ఏకంగా మెట్రో మార్గాన్నే రద్దు చేయాలని డిసైడ్ అయింది. ప్రజాప్రయోజనానికి సంబంధించి రవాణాను కొందరికి అనుకూలంగా మార్చిన వైనం.. దాన్ని ప్రస్తుత సర్కారు పక్కన పెట్టడంపై పెద్దయెత్తున చర్చకు దారితీస్తోంది.