Published 14 Dec 2023
అభిమానులు తనను ‘స్కై’గా ఎందుకు పిలుచుకుంటారో సూర్యకుమార్ యాదవ్ మరోసారి నిరూపించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి భారత జట్టుకు మంచి స్కోరు అందించాడు. ఆకాశమే హద్దుగా సిక్సర్లతో చెలరేగి మూడో టీ20లో సెంచరీ సాధించాడు. సూర్య(100; 56 బంతుల్లో 7×4, 8×6) హడలెత్తించడంతో టీమిండియా వేగంగా పరుగులు సాధించింది. ఈ శతకంతో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన రికార్డును సొంతం చేసుకున్న కెప్టెన్.. పొట్టి ఫార్మాట్ లో నాలుగు సెంచరీలతో కొత్త రికార్డును అందుకున్నాడు. ఓపెనర్ యశస్వి జైస్వాల్(60; 41 బంతుల్లో 6×4, 3×6) అండతో సూర్యకుమార్ చెలరేగిపోయాడు. జోహెన్నెస్ బర్గ్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ ఓడి బ్యాటింగ్ దిగిన టీమిండియా.. సూర్య, జైస్వాల్ ధనాధన్ ఇన్నింగ్స్ లతో నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లకు 201 పరుగులు చేసింది. తొలి నుంచి ప్రతి ఓవర్లోనూ 9 రన్ రేట్ కు తక్కువ కాకుండా ఈ ఇద్దరూ బ్యాటింగ్ కొనసాగించారు.
ఈ ఇద్దరు మినహా అంతా టపటపా
సూర్య, యశస్వి మినహా ఏ ఒక్కరూ భారత ఇన్నింగ్స్ లో పెద్దగా రాణించలేకపోయారు. గిల్(8) మరోసారి నిరాశపరిస్తే, తిలక్ వర్మ(0) పరుగులేమీ చేయకుండానే వెనుదిరిగాడు. చివర్లో ఫాస్ట్ గా ఆడే ఉద్దేశంతో రింకూ సింగ్(14), జితేష్ శర్మ(4), రవీంద్ర జడేజా(4) వెంటవెంటనే వికెట్లు కోల్పోయారు. లేదంటే భారత్ మరింత మెరుగైన స్కోరు సాధించేదే. ముఖ్యంగా ఈ ఇన్నింగ్స్ లో సూర్య ఆటే హైలెట్. ఫెహ్లుక్వాయో వేసిన ఒకే ఓవర్లో మూడు సిక్స్ లు, ఒక ఫోర్ తో 23 పరుగులు రాబట్టిన తీరు ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసింది. కేశవ్, విలియమ్స్ రెండేసి వికెట్లు.. బర్గర్, షంసి ఒక్కో వికెట్ చొప్పున తీసుకున్నారు.