
Published 17 Dec 2023
భారత్(India) తో జరుగుతున్న తొలి వన్డేలో దక్షిణాఫ్రికా(South Africa) జట్టుకు ప్రారంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పేసర్ అర్షదీప్ సింగ్ విజృంభించడంతో 3 పరుగులకే రెండు కీలక వికెట్లు కోల్పోయింది. జోహెన్నెస్ బర్గ్ లో జరుగుతున్న మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సఫారీ జట్టు.. స్కోరు బోర్డుపై మూడు పరుగులు చేరాయో లేదో వరుస బంతుల్లో రెండు వికెట్లు చేజార్చుకుంది. ఓపెనర్ రీజా హెన్రిక్స్(0) 8 బాల్స్ ఆడి డకౌట్ గా వెనుదిరిగాడు. అర్షదీప్ విసిరిన బంతిని ముట్టుకుంటే అది ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని వికెట్లను తాకింది. మరుసటి బంతికే చక్కటి ఇన్ స్వింగర్ తో రసెల్ వాన్ డెర్ డసెన్(0)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకుని LBWగా వెనక్కు పంపాడు.
ముగ్గురు పేసర్లు అర్షదీప్, ముకేశ్ కుమార్, ఆవేశ్ ఖాన్, ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, అక్షర్ పటేల్ తో బరిలోకి దిగిన టీమిండియా.. తుది-11లో రుతురాజ్ గైక్వాడ్, సాయి సుదర్శన్, తిలక్ వర్మకు చోటు కల్పించింది. ఇప్పటికే జరిగిన మూడు టీ20ల సిరీస్ లో ఇరు జట్లు 1-1తో సమంగా నిలవగా.. తాజాగా మూడు వన్డేల టోర్నీ జరుగుతోంది.