Published 18 Dec 2023
దేశంలో ఇప్పటిదాకా మహిళల విద్య కన్నా పురుషుల చదువుకే ప్రాధాన్యం ఇవ్వడం వల్ల అసమానతలు, లింగ వివక్ష పెరిగాయని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి(Chief Justice Of India) జస్టిస్ డి.వై.చంద్రచూడ్ అన్నారు. స్త్రీలకు వేతనాలు పెంచి వారు పురుషులతో సమానంగా ఉంటేనే వివక్ష తగ్గే అవకాశముందని అభిప్రాయపడ్డారు. భారతీయ సమాజంలో వ్యక్తిగత వ్యవస్థ కంటే వివాహ వ్యవస్థకు బలమైన పునాదులున్నాయని, ఈ వ్యవస్థను కాపాడటం ఛాలెంజ్ తో కూడుకున్న వ్యవహారమన్నారు. బెంగళూరులోనే నేషనల్ లా ఆఫ్ స్కూల్ లో నిర్వహించిన కార్యక్రమంలో CJI ప్రసంగించారు. వ్యక్తిగత జీవితాలు అత్యంత సున్నితమైన అంశాలని, ఇళ్లల్లోని స్త్రీ, పురుష భేదాలు రాజ్యాంగ వైఫల్యంగా భావించరాదని గుర్తు చేశారు.
అయితే వ్యక్తిగత జీవితాల్లో ఎదురయ్యే వివక్ష సమాజంపైనా ప్రభావం చూపిస్తుందని, ప్రస్తుతం జరుగుతున్న నేరాల్లో ఇదే కీలక పాత్ర పోషిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లోనే రాజ్యాంగం రూపొందించిన చట్టాలు పరిష్కారం చూపుతాయన్నారు. అనాదిగా వస్తున్న ఆచారాలపై ఏ రాజ్యాంగ చట్టమూ ప్రభావం చూపబోదన్న విషయాన్ని జస్టిస్ డి.వై.చంద్రచూడ్ చెప్పకనే చెప్పారు.