Published 18 Dec 2023
ముఖానికి మాస్కులు.. ఆమడ దూరంలో ఉండి పలకరించుకోవడం.. అడుగడుగునా చేతులు క్లీన్ చేసుకోవడం.. ఇదీ కొవిడ్ విజృంభణ కాలంలో ప్రజలు తీసుకున్న జాగ్రత్తలు. కానీ కొవిడ్ పోయి ఏడాది దాటింది. ఇక మనకేంలే అన్నట్లు మళ్లీ షేక్ హ్యాండ్ ల కాలం వచ్చేసింది. మాస్కుల సంగతి అటుంచితే చేతులు కడుక్కోవడమే గగనమైపోయింది. కానీ తాను మళ్లీ వస్తున్నానన్న వార్నింగ్ ను మరోసారి కరోనా పంపిస్తోంది. జాగ్రత్తలు పాటించకపోతే ఇక అంతే అన్నట్లు కొత్త వేరియంట్ తో దేశంలోకి అడుగుపెట్టింది. JN-1 వేరియంట్ ప్రాథమిక లక్షణాలు(Primary Symptoms) వెలుగుచూడటంతో కేంద్రం అలర్ట్ అయి అన్ని రాష్ట్రాలకు హెచ్చరికలు పంపింది. ఈ వేరియంట్ వల్ల ఇప్పటికే ప్రాణం నష్టం జరిగినట్లు ప్రచారం జరుగుతున్న దృష్ట్యా ప్రతి జిల్లాలోనూ జాగ్రత్తలు పాటించాలని కేంద్ర వైద్యారోగ్య శాఖ సెక్రటరీ సుధాన్ష్ పంత్ పేరిట లేఖలు పంపారు.
ప్రాథమిక లక్షణాలుంటే పరీక్షలే…
జ్వరం, జలుబు, తలనొప్పి, గొంతులో మంట వంటి ప్రాథమిక లక్షణాలు వ్యాధి సింప్టమ్స్ కాగా.. 4-5 రోజుల్లోనే ఇది వ్యాప్తి చెందుతుందని వైద్య నిపుణులు అంటున్నారు. అమెరికా, చైనాకు పాకిన JN-1 వేరియంట్.. మన దగ్గర కేరళలోని తిరువనంతపురం జిల్లా కారాకులానికి చెందిన మహిళలో ఈ నెల 8న గుర్తించారు. దేశంలో ఆదివారం నాడు 335 కేసులు వెలుగుచూడటంతో ప్రజలు అలర్ట్ గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరించింది. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ల కేసులపై పరిశోధన కొనసాగుతున్నట్లు WHO టెక్నికల్ కమిటీ చీఫ్ పేరిట వీడియో రిలీజైంది.
హాలిడేస్ తో ప్రమాదం…
హాలిడే సీజన్ రాబోతున్న దృష్ట్యా కరోనా వ్యాప్తి బాగా పెరిగే అవకాశాలున్నాయి. మన దేశ వాతావరణంలో స్థిరపడేలా ఉన్న JN-1 వేరియంట్ వేగంగా సర్క్యులేట్ అయ్యే ప్రమాదం ఉందంటున్నారు. మాస్క్ ధరించి జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రజలకు అన్ని రాష్ట్రాలూ చెబుతున్నాయి. మాస్క్ లు పెట్టుకోవాలంటూ ఇప్పటికే కర్ణాటకలో ప్రచారం మొదలు కాగా.. శబరిమలకు వెళ్లిన అయ్యప్ప భక్తులు రాష్ట్రానికి రానున్న దృష్ట్యా ఆ కోణంలో దృష్టిపెట్టాలని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్ని జిల్లాలను అలర్ట్ చేశారు.