Published 18 Dec 2023
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)… ఈ పేరు వింటేనే ప్రొఫెషనల్స్ లో దడ కనిపిస్తుండగా, కంపెనీల్లో అంతర్మథనం మొదలైంది. ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఉన్న జాబ్స్ ఊడిపోయే పరిస్థితి తయారైందన్న ప్రచారమూ ఎప్పట్నుంచో జోరుగా సాగుతోంది. అసలే ‘లే ఆఫ్’ల కాలం కొనసాగుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో AI అంటేనే బెంబేలెత్తుతున్నారు. కానీ అంతా మన మంచికే అన్నట్లు.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల ఉద్యోగాలు పెరుగుతాయే తప్ప తగ్గవంటున్నారు ప్రముఖ కంపెనీ అధినేత. అవును ఇది నిజంగా జరగబోతుందట. IT ప్రొఫెషనల్స్ స్థానాల్ని ఎట్టి పరిస్థితుల్లోనూ AI భర్తీ చేయబోదంటూ టెక్ మహీంద్రా CEO సి.పి.గుర్నానీ విశ్వాసంతో చెబుతున్నారు.
అవకాశాల ప్రపంచమిది…
స్కిల్డ్ ప్రొఫెషనల్స్ కు ఎప్పుడూ తిరుగుండదన్న గుర్నాని.. కొత్త కొత్త ఆలోచనలపై యువ ఇంజినీర్లు దృష్టిపెట్టి అప్డేట్ అవుతుంటే జాబ్ లు పెరుగుతాయే గానీ తగ్గవన్నారు. హార్డ్ వర్క్ చేయాలన్న ఇన్ఫోసిస్ అధినేత ఎన్.ఆర్.నారాయణమూర్తి మాటలతో తాను ఏకీభవిస్తున్నానని గుర్నాని స్పష్టం చేశారు.
‘ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ ఇంకా విస్తరిస్తూనే ఉంటుంది.. తద్వారా మరిన్ని జాబ్ లు క్రియేటవుతాయి.. AI ఛాట్GPTతో జాబ్ లు పోతాయని అనుకుంటున్నారో అవన్నీ అర్థరహితం.. మానవుల మాదిరిగా AI పనిచేస్తుందనుకుంటే పొరపాటే.. మారుతున్న కాలం, విధానాలకు అనుగుణంగా ఎవరైతే స్కిల్స్ పై ఎక్కువ దృష్టిపెడతారో అలాంటి వారికి తిరుగుండదు’ అంటూ ఈ నెల 19న CEOగా రిటైరవుతున్న గుర్నాని అన్నారు.
సంప్రదాయ పద్ధతికి స్వస్తి చెబితేనే…
‘ఇన్ఫీ అయినా, టెక్ మహీంద్రా అయినా క్యాంపస్ లో స్కిల్స్ నేర్పే సంస్కృతికి కాలం చెల్లింది.. క్యాంపస్ ఇంటర్యూల్లో ఉద్యోగులను సెలెక్ట్ చేసుకుని ట్రెయినింగ్ ఇవ్వడం అనేది సంప్రదాయ పద్ధతి.. భవిష్యత్తులో దీనికి పూర్తి విరుద్ధమైన రోజులు రాబోతున్నాయి.. స్వయంగా స్కిల్స్ పై దృష్టిపెట్టినవారిదే టెక్ ప్రపంచం’ అని గుర్నాని గుర్తు చేశారు. ఐటీ నిపుణులు వారంలో 70 గంటల పాటు పనిచేయాలన్న నారాయణమూర్తి కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు తలెత్తాయి. కానీ తాను మూర్తి మాటలను సమర్థిస్తున్నానన్న గుర్నాని.. హార్డ్ వర్క్ ను మించిన సాధనం మరొకటి లేదని చెప్పుకొచ్చారు.