Published 19 Dec 2023
తొలిసారి విదేశీ గడ్డపై జరుగుతున్న ఐపీఎల్(Indian Premier League) మినీ వేలానికి రంగం సిద్ధమైంది. దుబాయి వేదికగా జరిగే ఈ కార్యక్రమం కొద్దిసేపట్లోనే మొదలుకానుంది. 333 మంది ఆటగాళ్లు వేలానికి రెడీగా ఉంటే అందులో 214 మంది భారత ప్లేయర్లున్నారు. 77 ఖాళీలుండగా 33 మంది విదేశీ క్రికెటర్లు అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. గతానికి భిన్నంగా బాగా ఆడుతున్న ప్లేయర్లకే యాజమాన్యాలు రెడ్ కార్పెట్ పరుస్తున్నాయి. వరుసగా ఫెయిలవుతున్న ఆటగాళ్లను రిలీజ్ చేస్తూ తమ దగ్గరున్న బ్యాలెన్స్ తో మిగతా వారిని కొనుగోలు చేస్తున్నాయి. మొన్నటి వరల్డ్ కప్ పర్ఫార్మెన్స్ చూస్తే ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ క్రీడాకారులకు డిమాండ్ ఉండే అవకాశమున్నట్లు మాజీలు అంటున్నారు.
స్వదేశీ ఆల్ రౌండర్ల వేట
గత కొద్దికాలంగా విదేశీ జట్లను చూస్తే ప్రతి టీమ్ లో ముగ్గురు, నలుగురు ఆల్ రౌండర్లు ఉంటున్నారు. అదే టీమిండియాకు వచ్చేసరికి ఒకరిద్దరితోనే నెట్టుకు రావాల్సి వస్తోంది. హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ ఇలా వీరిపైనే ఆధారపడాల్సి రావడం ఎవరైనా గాయాల పాలైతే ఉన్న ఒక్కరితోనే నెట్టుకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో IPLలో 15 సీజన్లు గడుస్తున్నా నాణ్యమైన ఆల్ రౌండర్లు దొరకడం లేదు. తూతూమంత్రంగా కాకుండా నికార్సైన ఆల్ రౌండర్లుంటే IPLకు మరింత క్రేజ్ పెరగడంతోపాటు ఫ్యూచర్ టీమిండియాకు తిరుగుండదు. కాబట్టి ఈ వేలంలో ఆల్ రౌండర్లపై దృష్టిపెడతారా లేదా అన్నది కాసేపట్లో తేలుతుంది.
విదేశీ ప్లేయర్లపై మోజు
గత సీజన్లో ఇంగ్లండ్ ప్లేయర్ శామ్ కరణ్ కు అత్యధికంగా రూ.18.5 కోట్లు వెచ్చించడం హైలెట్ గా నిలిచింది. ఈసారి సైతం ఫారిన్ ఆటగాళ్ల లిస్ట్ లో కొంతమంది క్రికెటర్లు ముందువరుసలో ఉన్నారు. ఆస్ట్రేలియా లెఫ్టార్మ్ పేసర్ మిచెల్ స్టార్క్, కివీస్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర, వరల్డ్ కప్ ఫైనల్ సెంచరీ హీరో ట్రావిస్ హెడ్ వంటి ఆటగాళ్లపై అన్ని జట్లూ కన్నేశాయి. కాబట్టి అతి తక్కువ మందిని సెలక్ట్ చేసుకునే అవకాశమున్న ఈ మినీ వేలంలో ఎవరికి చోటు దక్కుతుందన్నది కొద్దిసేపటిదాకా సస్పెన్స్ గా మారింది. ఐపీఎల్ తర్వాత టీ20 వరల్డ్ కప్ ఉండటంతో భారత యువ ప్లేయర్లను గుర్తించేలా ఈ టోర్నీ ఉపయోగపడనుంది అనడంలో సందేహం లేదు.