Published 20 Dec 2023
శాసనసభ సమావేశాల్లో శ్వేత పత్రం విడుదల చేసినప్పటి నుంచి అధికార, ప్రధాన ప్రతిపక్షాల మధ్య ఆసక్తికర చర్చ చోటుచేసుకుంది. BRS తరఫున హరీశ్ రావు అన్నీ తానై వ్యవహరిస్తూ శ్వేత పత్రం తప్పుల తడక అంటూ విమర్శించారు. హరీశ్ తీరుపై మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం, ఉత్తమ్ కుమార్ రెడ్డి మండిపడ్డారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం ఎదురుదాడికి దిగుతూ గత ప్రభుత్వం నిర్వాకం ఇది అంటూ ఫైర్ అయ్యారు. సాయంత్రం మరోసారి చర్చ మొదలుపెట్టిన రేవంత్ రెడ్డి.. మాజీ మంత్రి KTRని ఉద్దేశిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. అధికార పక్షం నుంచి ప్రతిపక్షంలో కూర్చోవడం ఎవరికైనా బాధగా ఉంటుందంటూ మాట్లాడారు. అంతేకాకుండా తండ్రి గద్దె దించేందుకైనా కొందరు వెనుకాడరు అంటూ వ్యంగ్యపు మాటలతో విపక్షాన్ని ఇరుకునపెట్టారు.
ఔరంగజేబు లాంటి వాళ్లు చరిత్రలో…
‘ఇటు నుంచి అటు కూర్చోవడం అంటే బాధగా ఉంటుంది.. కొంతమందికి దుఃఖం కూడా వస్తుంది.. కొద్దిమందికి తీరని కోరికలుంటాయి.. తండ్రిని కూడా అడ్డు తొలగించుకుని కుర్చీలో కూర్చోవాలి అనుకునేటోళ్లూ ఉంటరు.. ఔరంగజేబ్ లాంటి వాళ్లు.. ఇవన్నీ మనం చూసినం కద చరిత్రలో’ అంటూ ముక్తాయించారు. దీంతో కాంగ్రెస్ సభ్యులంతా బల్లలు చరుస్తూ CMను సమర్థించుకుంటూ నవ్వుల్లో మునిగిపోయారు.