Published 21 Dec 2023
విద్యుత్తు రంగం పరిస్థితిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విసిరిన సవాల్ కు ప్రభుత్వం స్పందించింది. దీనిపై స్వయంగా ప్రకటన చేసిన ముఖ్యమంత్రి.. న్యాయ విచారణ(Judicial Enquiry) చేస్తామని ప్రకటించారు. అసెంబ్లీలో మాట్లాడిన CM.. మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ ను స్వీకరిస్తూ మూడు అంశాలపై విచారణకు ఆదేశిస్తున్నట్లు స్పష్టం చేశారు. విద్యుత్తు రంగంలో అవినీతి అక్రమాలు చోటుచేసుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అంతకుముందు జగదీశ్ రెడ్డిని విమర్శించారు. రూ.10 వేల కోట్ల అవినీతికి మాజీ మంత్రి పాల్పడ్డారంటూ వెంకట్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
దీనిపై మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ఎదురుదాడికి దిగుతూ.. చేతనైతే జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేయించుకోండంటూ సవాల్ విసిరారు. ఈ ఛాలెంజ్ ను సీరియస్ గా తీసుకున్న ముఖ్యమంత్రి రేవంత్… జ్యుడిషియల్ ఎంక్వయిరీకి సిద్ధంగా ఉండాలని సభ వేదికగా స్పష్టం చేశారు. ఈ శాసనసభ విచారణకు ఆదేశిస్తుందంటూ ప్రకటన చేశారు. ఛత్తీస్ గఢ్ రాష్ట్రంతో చేసిన ఒప్పందాలు, యాదాద్రి థర్మల్ ప్లాంట్ కు సంబంధించిన అంశాలపైన విచారణ ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. న్యాయ విచారణ ప్రక్రియపై ఉప ముఖ్యమంత్రితోపాటు విద్యుత్తు శాఖ మంత్రి తదుపరి కార్యాచరణ ప్రారంభించాలని సీఎం సభలోనే ఆదేశించారు.