Published 21 Dec 2023
విద్యుత్తు రంగంపై శాసనసభలో శ్వేతపత్రం(White Paper) విడుదల చేసిన సందర్భంగా చర్చ హాట్ హాట్ గా సాగింది. ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క వివరాలు తెలియజేసిన తర్వాత విద్యుత్తు శాఖ మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి వివరణ ఇస్తున్నారు. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ ఇవ్వని విధంగా కరెంట్ సప్లయ్ చేశామని చెబుతున్న టైమ్ లోనే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కలుగజేసుకున్నారు. జగదీశ్ రెడ్డి వివరణపై విమర్శలు చేసిన వెంకట్ రెడ్డి.. మాజీ మంత్రి చెబుతున్నవన్నీ అబద్ధాలని విమర్శలు చేశారు. ‘అధికారంలో ఉన్నంతకాలం అబద్ధాలు చెప్పారు.. ఇప్పుడు కూడా అబద్ధాల్ని ప్రతిరోజూ చెబుతూనే ఉన్నారు.. కరెంటు తీగలు పట్టుకోండని ఏదేదో మాట్లాడారు.. సిరిసిల్లలోనే కరెంటు తీగలు పట్టుకోవడానికి రెడీ అని చెప్పాం.. లాగ్ బుక్ లు ఎందుకు దాచిపెట్టారు.. గత ఎనిమిదేళ్లలో 8 నుంచి 10 గంటలు మాత్రమే ఇచ్చారు.. 8 సంవత్సరాల్లో ఒక్కసారి మాత్రమే మార్చి, ఏప్రిల్ లో 10-12 గంటలు కరెంటిచ్చారు’ దూకుడును మరింత పెంచారు.
నేరుగా ఆరోపణలు
‘నల్గొండలో 29 వేల కోట్లతో యాదాద్రి పవర్ ప్లాంట్ స్టార్ట్ చేశారు.. దేశంలోనే అతిపెద్ద కుంభకోణం యాదాద్రి ప్లాంట్.. ఇందులో ఈయన(జగదీశ్ రెడ్డి)కి రూ10 వేల కోట్లు ముట్టింది.. దీనిపై మీ కథంతా తీస్తాం.. అసలు సంగతి తేలుస్తాం’ అంటూ మంత్రి కోమటిరెడ్డి తీవ్రస్థాయిలో నేరుగా ఆరోపణలు చేశారు. దీనిపై మాజీ మంత్రి మళ్లీ జోక్యం చేసుకుంటూ అవసరమైతే జ్యుడిషియల్ ఎంక్వయిరీ చేసుకోండంటూ సవాల్ విసిరారు. జగదీశ్ రెడ్డి మాటలకు రెస్పాండ్ అయిన ముఖ్యమంత్రి.. స్వయంగా వివరణ ఇస్తూనే న్యాయ విచారణకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించారు. ఛత్తీస్ గఢ్ తో కుదుర్చుకున్న ఒప్పందాలు.. 1,080 మెగావాట్ల భద్రాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణం, మిర్యాలగూడ నియోజకవర్గంలో నిర్మిస్తున్న యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు ఒప్పందం, నిర్మాణాలపై న్యాయ విచారణ జరుగుతుందని CM తెలియజేశారు.