Published 21 Dec 2023
రెజ్లింగ్ ఫెడరేషన్ లో నెలకొన్న రాజకీయాలు దిగ్గజ క్రీడాకారిణిని ఆటకు దూరం చేశాయి. ఎవరిపైనైతే పోరాటం చేస్తున్నారో అలాంటి వారి సన్నిహితులే తిరిగి ఆధిపత్యం చేసే అవకాశం ఉండటంతో ఇక చేసేదిలేక తన కెరీర్ కు గుడ్ బై చెప్పింది. భారత రెజ్లింగ్ ఫెడరేషన్(WFI)కి జరిగిన ఎన్నికల్లో అధ్యక్షుడిగా సంజయ్ సింగ్ విజయం సాధించారు. అయితే మాజీ అధ్యక్షుడైన బ్రిష్ భూషణ్ ఇతడు సన్నిహితుడు కావడంతో రెజ్లర్లంతా నిరాశలో మునిగిపోయారు. దీంతో తాను రెజ్లింగ్ నుంచి తప్పుకుంటున్నానని దిగ్గజ ప్లేయర్ సాక్షి మాలిక్ ప్రకటించింది. ఫ్రీస్టయిల్ విభాగంలో తొలి ఒలింపిక్స్ మెడల్ సాధించిన భారత ప్లేయర్ గా సాక్షి రికార్డు క్రియేట్ చేసింది. హరియాణాకు చెందిన ఈమె 2016లో 58 కేజీల విభాగంలో కాంస్య పతకం అందుకుంది. అలాంటి టాప్ ప్లేయర్ తన కెరీర్ నే ముగించుకోవడం బాధాకర ఘటనగా మిగిలిపోనుంది.
అసలేం జరిగిందంటే…
జూనియర్ రెజ్లర్లను లైంగిక వేధించినందున రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(WFI) ఇంతకుముందటి అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ పై చర్యలు తీసుకోవాలంటూ రెజ్లర్లు ఆందోళన బాట పట్టారు. సీనియర్లు సాక్షి మాలిక్, వినేశ్ ఫొగాట్, భజరంగ్ పునియాతోపాటు పలువురు క్రీడాకారులు ఉద్యమానికి దిగారు. మే 28న నూతన పార్లమెంటు ఎదుట బైఠాయించడంతో వారిని నిర్బంధంగా అరెస్టు చేయాల్సి వచ్చింది. అనంతరం కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్.. రెజ్లర్లను పిలిపించుకుని బ్రిజ్ భూషణ్ పై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. మరోవైపు కోర్టు కూడా ఆయనకు సమన్లు జారీ చేసింది. ఇలాంటి పరిస్థితుల్లో రెజ్లింగ్ సమాఖ్యకు మహిళను అధ్యక్షురాలు చేయాలంటూ డిమాండ్లు వినిపించారు. కానీ అది జరగకపోవడం, బ్రిజ్ భూషణ్ సన్నిహితుడిగా భావిస్తున్న సంజయ్ సింగ్ ప్రెసిడెంట్ గా ఈరోజు ఎన్నిక కావడంతో ఇక తన కెరీర్ ను వదులుకుంటున్నట్లు సాక్షి మాలిక్ ప్రకటించింది. ఇలా ఒక సమాఖ్య(Federation)లో చోటుచేసుకున్న రాజకీయాలు.. భారత ఆశాకిరణం ఆశల్ని చిదిమేశాయి.