
టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ఇటీవలే ‘ఉగ్రం’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. కామెడీని వదిలిపెట్టి సీరియస్ యాంగిల్లో చేసిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వర్కవుట్ కాలేదు. దీంతో నెక్ట్స్ మూవీపై కాన్సంట్రేట్ చేశారు నరేష్. ఇది తన కెరీర్లో 62వ చిత్రంగా రాబోతుండగా.. నేడు (జూన్ 30) బర్త్‌డే సందర్భంగా ఇంట్రెస్టింగ్ వీడియోతో ప్రాజెక్ట్ ప్రకటించారు. ‘సోలో బతుకే సో బెటర్’ చిత్రంతో పర్వాలేదనిపించుకున్న సుబ్బు మంగాదేవి.. ఈ మూవీకి దర్శకత్వం వహించనున్నారు.

ఇక అనౌన్స్మెంట్ వీడియో విషయానికొస్తే.. ముందు సుబ్బు నుంచి నరేష్‌కు ఫోన్ వచ్చింది. కథ చెప్తానంటే ఆఫీస్‌కు రమ్మంటాడు నరేష్. కానీ అక్కడ చెప్పే కథ కాదంటాడు సుబ్బు. పోనీ కాఫీ షాప్ లేదా గుడిలో చెప్పమన్నా కరెక్ట్ ప్లేస్ కాదని నసుగుతాడు. మరి ఇంకెక్కడ చెప్తాడని నరేష్ ఆలోచిస్తుండగానే.. సెటప్ జనతా బార్‌కు మారిపోతుంది. అక్కడ సుబ్బు చెప్పిన ఎమోషనల్ స్టోరీకి కనెక్ట్ అయిన నరేష్.. మరి ఈ కథను నమ్మే ప్రొడ్యూసర్ దొరకాలి కదా అని సుబ్బుతో డిస్కస్ చేస్తుంటాడు. ఇంతలోనే అదే బార్లో పక్క టేబుల్‌పై ఉన్న ప్రొడ్యూసర్.. నేను రెడీ అని వచ్చేస్తాడు.
ఇదే క్రమంలో మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్, ప్రొడక్షన్ డిజైనర్ బ్రహ్మ కడలి, కెమెరామాన్గా రిచర్డ్ ఎం నాథన్, ఎడిటర్‌గా చోటా కె ప్రసాద్ కూడా సెట్ అయిపోతారు. దీంతో ఫైనల్‌గా ఈ సినిమా మనం చేస్తున్నామంటూ సిగరెట్ కాల్చుతూ మాస్ స్టైల్లో ప్రకటించాడు నరేష్. హాస్య మూవీస్ పతాకంపై రాజేశ్ దానాడ, బాలాజీ గుట్ట ఈ సినిమాను నిర్మించనున్నారు. ఇక ఈ కాన్సెప్ట్ వీడియో మాదిరే సినిమా కూడా చాలా కొత్తగా ఉంటుందని చెప్పకనే చెప్పాడు దర్శకుడు. #N62 పేరుతో తెరకెక్కనున్న ఈ చిత్రం త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుంది.