Published 22 Dec 2023
దశాబ్దాలుగా మిత్ర దేశాలుగా మెలుగుతున్న భారత్-ఫ్రాన్స్(India-France) సంబంధాలు మరో మైలురాయికి చేరుకుంటున్నాయి. ఇప్పటికే రక్షణ, న్యూక్లియర్, వాణిజ్యం, విద్య, సాంస్కృతిక సంబంధాల్లో వారధిగా నిలుస్తున్న ఈ రెండు దేశాలు.. మరో చారిత్రక వేడుకకు సిద్ధమవుతున్నాయి. వచ్చే గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఫ్రెంచి అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ హాజరవుతున్నారు. భారత్-ఫ్రాన్స్ సంబంధాలకు 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ప్రధాని మోదీ మొన్నటి జులైలో ఫ్రాన్స్ లో పర్యటించారు. ఆ దేశ ‘బాస్టిల్ డే’కు చీఫ్ గెస్ట్ గా మోదీ హాజరు కాగా.. మన త్రివిధ దళాలకు చెందిన 241 మంది సైనికులు సైతం అక్కడి పరేడ్ లో పాల్గొన్నారు.
జో బైడెన్ అనుకున్నా..
వాస్తవానికి ఈ వేడుకలకు అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ ను పిలుద్దామనుకున్నారు. కానీ ఆయనకు వీలు కుదరకపోవడంతో ఫ్రాన్స్ అధ్యక్షుణ్ని ఆహ్వానిస్తున్నారు. 1789 ఫ్రెంచి విప్లవ నినాదాలైన స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని పరిరక్షిస్తూ ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో రెండు దేశాలు కీలకంగా వ్యవహరిస్తున్నాయని ఇరు దేశాలకు పేరుంది. ఇలాంటి పరిస్థితుల్లో మేక్రాన్ రావడం భారత్-ఫ్రాన్స్ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న భావన ఇరు దేశాల్లోనూ ఉంది. ఈ సెప్టెంబరులో ఢిల్లీలో నిర్వహించిన జీ-20 సమ్మిట్ లోనూ మేక్రాన్ పాల్గొన్నారు. హస్తినలో జరిగే వేడుకలకు హాజరవుతున్న 6వ ఫ్రెంచ్ నేతగా మేక్రాన్ నిలిచిపోనున్నారు. 1976, 1998లో జాక్వెస్ చిరాక్.. 1980లో వాలరీ గిస్గార్డ్ డీ-ఎస్టేటింగ్.. 2008లో నికోలస్ సర్కోజి.. 2016లో ఫ్రాంకోయిస్ హోలండ్ మన దేశ వేడుకలకు హాజరయ్యారు.