Published 22 Dec 2023
రాష్ట్రంలో మరో కొత్త పార్టీ అవతరించబోతున్నది. అసెంబ్లీ ఎన్నికల కల్లా ఆంధ్రప్రదేశ్ లో నూతన పార్టీ పురుడు పోసుకుంటోంది. CBI మాజీ JD(Joint Director) లక్ష్మీనారాయణ పొలిటికల్ పార్టీ పెడుతున్నట్లు ప్రకటించారు. విజయవాడలో నిర్వహించిన సమావేశంలో పార్టీ పేరును కూడా తెలియజేశారు. ఇక నుంచి APలో కొత్త పార్టీ పనిచేయనుందని, ‘జై భారత్ నేషనల్’ పేరుతో ఎన్నికల రంగంలోకి దిగుతామని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే అతి కొద్ది నెలల్లోనే శాసనసభ ఎన్నికలు జరగబోతున్నాయి. అధికార YSRCP, TDP, జనసేన, BJP ప్రధాన పార్టీలుగా తలపడుతుండగా.. పొత్తులతో TDP-జనసేన ముందుకెళ్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో లక్ష్మీనారాయణ పెట్టే పార్టీ విధివిధానాలు ఎలా ఉంటాయన్నది తెలియాల్సి ఉంది. జనసేనలో కొద్దికాలమే ఉండి అందులో నుంచి బయటకు వచ్చారు.
CBI జాయింట్ డైరెక్టర్ గా ఉమ్మడి రాష్ట్రంలో సేవలందించిన వి.లక్ష్మీనారాయణ.. బళ్లారి మైనింగ్, జగన్ కేసుల్లో కీలకంగా వ్యవహరించారు. ఆ కాలంలో డైనమిక్ అధికారిగా పేరు తెచ్చుకోగా.. ఉద్యోగాన్ని అర్థంతరంగా(VRS) వదిలేశారు. రాష్ట్రంలోని పార్టీలపై పెద్దగా ఆయనకు ఇంట్రస్ట్ లేకపోగా.. ఇంతకాలం వేచిచూసే ధోరణితో ఉన్నారు. మహారాష్ట్ర కేడర్ కు చెందిన ఈ మాజీ IPS.. ఇక తానే స్వయంగా పార్టీ ఎందుకు పెట్టకూడదన్న ఆలోచనతో కొత్త పార్టీకి శ్రీకారం చుట్టారు.