
Published 22 Dec 2023
తొలుత ప్రజాదర్బార్ తో ప్రజల వినతులు స్వీకరిస్తూ ఆ కార్యక్రమానికి ప్రజావాణిగా పేరు మార్చిన రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్ఠాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టబోతున్నది. ‘ప్రజాపాలన’ పేరుతో ప్రారంభించే ఈ కొత్త కార్యక్రమంపై కలెక్టర్ల సదస్సులో చర్చించబోతున్నారు. ఈ నెల 28 నుంచి జనవరి 6 వరకు ఈ ‘ప్రజాపాలన’ కార్యక్రమం నిర్వహించాలని సర్కారు నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన విధివిధానాలు(Guidelines) ఖరారు కావాల్సి ఉంది. జిల్లాల్లో నెలకొన్న సమస్యలు, ప్రజలకు సేవలందించేందుకు గల వెసులుబాట్ల గురించి జిల్లా పాలనాధికారుల(Collectors)తో సమీక్షించబోతున్నారు. ఈ నెల 24న సెక్రటేరియట్ లో కలెక్టర్ల సదస్సు జరుగుతుంది.
ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు ఆరు గ్యారెంటీలను పూర్తి స్థాయిలో అమలు చేయడంతోపాటు కొత్త రేషన్ కార్డులు, భూమాత పోర్టల్ వంటి స్కీమ్ లు అమలు చేయాల్సి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయి(Ground Level)లో నెలకొన్న సమస్యలను అధ్యయనం చేయడంతోపాటు నేరుగా ప్రజలతో మమేకమైతేనే వాటికి పరిష్కారం లభిస్తుందన్న కోణంలో సర్కారు ఆలోచన ఉన్నట్లు కనపడుతోంది. అందుకే ఈ ‘ప్రజాపాలన’ కార్యక్రమం అమలుకు రంగం సిద్ధమవుతోంది.