Published 22 Dec 2023
సంచలన రీతిలో సినిమాలు తీసి వివాదాస్పదంగా వ్యవహరించే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ(RGV)కి షాక్ తగిలింది. తన కొత్త మూవీ ‘వ్యూహం’కు సంబంధించి కోర్టు ఆంక్షల్లో చిక్కుకోవాల్సి వచ్చింది. ఈ సినిమాపై నారా లోకేశ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. అభ్యంతరకర సీన్స్ ఉన్నందున ‘వ్యూహం’ మూవీని నిలిపివేయాలంటూ పిటిషన్ వేశారు. చంద్రబాబు ప్రతిష్ఠ దెబ్బతినేలా పాత్రలు రూపొందించారని, తక్షణమే విడుదలను ఆపకపోతే మనోభావాలు దెబ్బతినే ప్రమాదముందని పిటిషన్ లో వివరించారు. దీన్ని విచారణకు స్వీకరించిన సిటీ సివిల్ కోర్టు.. ఆంక్షలు విధిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.
నిర్మాణ సంస్థకు నోటీసులు
‘వ్యూహం’ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతోపాటు సినిమా నిర్మాణ సంస్థ రామదూత క్రియేషన్స్ కు కోర్టు నోటీసులు ఇచ్చింది. ఓటీటీ, ఆన్ లైన్, ఇంటర్నెట్ వేదికల్లో ఎక్కడా విడుదల చేయకూడదని స్పష్టం చేసింది. మరోవైపు లోకేశ్ పిటిషన్ పై విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.