Published 23 Dec 2023
కొత్త ప్రభుత్వం కొలువుదీరిన తర్వాత జరగబోయే జిల్లా బాస్ ల(Collectors) మీటింగ్ పైనే అందరిలోనూ ఆసక్తి ఏర్పడింది. ఇప్పటిదాకా ప్రతిపక్ష BRSను లక్ష్యంగా చేసుకుని శాసనసభ(Assembly) వేదికగా శ్వేతపత్రాలను విడుదల చేసిన కాంగ్రెస్ సర్కారు.. ఆదివారం జరిగే కలెక్టర్ల మీటింగ్ ఆధారంగానే నిర్ణయాలు తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఆరు గ్యారెంటీల్లో ఇప్పటికే రెండింటిని అమలు చేసిన రేవంత్ ప్రభుత్వం.. మిగతా నాలుగింటితోపాటు క్షేత్రస్థాయిలో నెలకొన్న సమస్యలను ఈ భేటీ ద్వారా తెలుసుకునే వీలుంటుంది. సమస్యల గురించి ప్రభుత్వ పెద్దలకు ఎన్నికల ముందే తెలిసినా వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన అంశాలను జిల్లా పాలనాధికారుల నుంచి స్వీకరించే వీలు ఏర్పడింది. కాంగ్రెస్ పగ్గాలు చేపట్టిన తర్వాత మొట్టమొదటగా అమలు చేయబోతున్న అతి పెద్ద కార్యక్రమం కొత్త రేషన్ కార్డులు. వచ్చే నెలలో కొత్త కార్డులకు అప్లికేషన్లు తీసుకుంటారన్న ప్రచారం జరుగుతున్న వేళ రేపటి భేటీ కీలకం కానుంది.
మిగతా స్కీమ్ లే పెద్ద టాస్క్
రాష్ట్ర ఆర్థిక స్థితి గురించి శ్వేత పత్రాలు విడుదల చేసినా ఇచ్చిన హామీల్ని మాత్రం అమలు పరచాల్సి ఉంది. పింఛన్లు, ధరణి స్థానంలో తీసుకువచ్చే భూమాత పోర్టల్, ఉద్యోగ నియామకాలు, పోడు పట్టాల వంటి ప్రధాన సమస్యలున్నాయి. 100 రోజుల్లో ఆరు గ్యారెంటీలకు తోడు నిన్ననే అమల్లోకి తీసుకువచ్చిన ‘ప్రజాపాలన’పైన దృష్టిసారించే ఛాన్సెస్ ఉన్నాయి. జిల్లాల వారీగా స్కీమ్ లు అమలు కావాలంటే చేయాల్సిన కార్యాచరణపై కలెక్టర్ల వివరణ ఆధారంగానే సర్కారు ముందడుగేసే అవకాశముంది. కాబట్టి రేపు సచివాలయంలో జరిగే మీటింగ్ పైనే అందరిలోనూ ఇంట్రస్టింగ్ కనిపిస్తోంది.