గత కొద్దిరోజులుగా ఆంధ్రప్రదేశ్ లో నమోదవుతున్న ఉష్ణోగ్రతల ప్రభావం దృష్ట్యా ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రేపటి నుంచి పునఃప్రారంభం కానున్న పాఠశాలల్లో ఈ నెల 17 వరకు ఒంటిపూట మాత్రమే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఉదయం 7:30 నుంచి 11:30 వరకు తరగతులు ఉండాలని స్పష్టం చేసింది. విద్యా ప్రణాళిక ప్రకారం ఈ నెల 19 నుంచి యథావిధిగా పూర్తిస్థాయిలో పాఠశాలలు నడుస్తాయని తెలిపింది. ఎండాకాలం సెలవుల అనంతరం ఈ నెల 12 నుంచి విద్యాలయాలు ప్రారంభించాల్సి ఉంది. అయితే రాష్ట్రవ్యాప్తంగా వేడిగాలులు, అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వీటి ప్రభావం పిల్లలపై పడకుండా ఉండేందుకు ఉదయం పూట తరగతులు నిర్వహించాలని నిర్ణయించింది. విద్యాశాఖ సూచనల మేరకు మధ్యాహ్నం 12 గంటల లోపు విద్యార్థులంతా ఇళ్లకు చేరుకునేలా షెడ్యూల్ రూపొందించి అన్ని జిల్లాల డీఈవోలకు ఉన్నతాధికారులు ఉత్తర్వులు పంపించారు.