
చంద్రబాబు కేసు విషయంలో రోజంతా చోటుచేసుకున్న ఉత్కంఠకు తెరపడింది. స్కిల్ డెవలప్ మెంట్ కేసులో చివరకు ఈ మాజీ ముఖ్యమంత్రికి 14 రోజుల రిమాండ్ విధిస్తూ ACB కోర్టు ఆదేశాలు ఇచ్చింది. 14 రోజుల పాటు జ్యుడీషియల్ రిమాండ్ విధించి రాజమండ్రి సెంట్రల్ జైల్ కు తరలించాలని ఆదేశించింది. ఈ నెల 22 వరకు రిమాండ్ విధిస్తున్నట్లు తెలిపింది. స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును ఈరోజు ఉదయం 8 గంటలకు కోర్టులో హాజరుపరిచారు. ఈ క్రమంలో CID అధికారులు కోర్టుకు రిమాండ్ రిపోర్ట్ సమర్పించారు. ఈ రిపోర్ట్ లో బాబును A37గా పేర్కొంటూ నేరంలో ఆయనే ప్రధాన సూత్రధారి అని స్పష్టం చేసింది. స్కిల్ డెవలప్మెంట్ కు సంబంధించి సీమెన్స్ ప్రాజెక్టు కోసం 6 సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ కేంద్రాలు, 36 టెక్నికల్ స్కిల్ డెవల్మెంట్ సంస్థల ఏర్పాటుకు అగ్రిమెంట్ చేసుకున్నారని రిమాండ్ రిపోర్ట్ లో CID అధికారులు తెలియజేశారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వ వాటాగా డిజైన్ టెక్ లిమిటెడ్ కు రూ.371 కోట్లు రిలీజ్ చేశారని, ట్రాన్జాక్షన్స్ జరిగిన మేరకు డిజైన్ టెక్ సంస్థ సర్వీసు అందించలేదని CID పేర్కొంది. రూ.241 కోట్లకు సంబంధించిన లావాదేవీల్లో నకిలీ బిల్లులు ఉన్నట్లు మహారాష్ట్రలోని GST ఇంటెలిజెన్స్ గుర్తించినట్లు తెలిపింది. నకిలీ బిల్లులతో షెల్ కంపెనీల బ్యాంకు అకౌంట్ల నుంచి హవాలా ద్వారా నిధులు కాజేశారని రిమాండ్ రిపోర్ట్ లో వివరించింది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు లాయర్ సిద్ధార్థ్ లూథ్రా.. CID తరఫున అడిషనల్ AG పొన్నవోలు సుధాకర్ రెడ్డి టీమ్ వాదనలు వినిపించింది. మధ్యాహ్నం రెండున్నర గంటల వరకు ఇరుపక్షాల లాయర్లు సుదీర్ఘ వాదనలు వినిపించగా… వీటన్నింటినీ పరిశీలించిన న్యాయస్థానం చివరకు చంద్రబాబుకు రిమాండ్ విధించింది.