సౌర తుపాన్ల వల్ల భూమిపై సమాచార వ్యవస్థలకు కలిగే అంతరాయాలపై ప్రయోగాలు చేసే ఆదిత్య-ఎల్ 1 రాకెట్ ను భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ISRO విజయవంతంగా నింగిలోకి పంపింది. ఈ ప్రయోగం విజయవంతమైందని ఇస్రో ఛైర్మన్ సోమనాథ్ ప్రకటించారు. ఇస్రో నుంచి దూసుకెళ్లిన గంటా 6 నిమిషాలకు అది నిర్ధారిత కక్ష్యలోకి ప్రవేశించింది. ఈ ప్రయోగం ద్వారా తమపై ప్రపంచానికి మరింత నమ్మకం పెరిగిందన్నారు. సూర్యుడిపై అధ్యయనం కోసం ఏడు పేలోడ్ లను మోసుకెళ్లే మిషన్ ను పంపగా… అంచనాల ప్రకారమే రాకెట్ సరైన దిశగా సాగుతున్నది. దేశవ్యాప్తంగా గల వివిధ సంస్థల సహకారంతో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన రాకెట్ ను తిరుపతి జిల్లా శ్రీహరికోట నుంచి ప్రయోగించారు.
సతీష్ ధవన్ స్పేస్ సెంటర్ నుంచి PSLV-C57 ద్వారా వ్యోమనౌక ఉదయం 11:50 గంటలకు నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లింది. రాకెట్ నుంచి విజయవంతంగా ఎల్ 1 విడిపోయింది. ఇది విడిపోయిన వెంటనే ఇస్రో ఛైర్మన్ సోమనాథ్.. ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ప్రయోగం సక్సెస్ కావడంతో శాస్త్రవేత్తల్లో హర్షాతిరేకాలు వ్యక్తమయ్యాయి. అటు దేశవ్యాప్తంగా అందరిలోనూ ఆనందోత్సాహాలు కనిపించాయి.
సైంటిస్టులకు మోదీ అభినందనలు
ఆదిత్య ఎల్ 1 ప్రయోగంలో పాల్గొన్న ఇస్రో సైంటిస్టులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. చంద్రయాన్-3 తర్వాత భారత స్పేస్ జర్నీ నిర్విఘ్నంగా కొనసాగుతోందన్న ఆయన.. శాస్త్రవేత్తల నిరంతర శ్రమ, కృషి ఫలితంగానే ఈ విజయాలంటూ కొనియాడారు.