ఆధారాలు ఉన్నాయి కాబట్టే మాజీ CM చంద్రబాబు నాయుడు జైలుకు వెళ్లారని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. ఆధారాలు లేకుండా అన్యాయంగా కోర్టులు ఏ విధమైన నిర్ణయాలు తీసుకోవన్న ఆయన దీని ద్వారా సానుభూతి పొందాలని చూస్తున్నారని విమర్శించారు. సంస్థల్ని, వ్యవస్థల్ని మేనేజ్ చేసి బోను ఎక్కకుండా తప్పించుకుపోయే సమర్థుడు చంద్రబాబు అని తెలిపారు. ఇప్పుడీ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఆ ఆటలు సాగలేవని, అరెస్టు అయినప్పటి నుంచి చాలా కుట్రలకు తెరలేపారని గుర్తు చేశారు. నంద్యాలలో అరెస్టు చేసిన తర్వాత హెలికాప్టర్ లో తీసుకువెళ్తామని చెప్పినా రోడ్డు ద్వారానే వస్తానని చెప్పడానికి ప్రధాన కారణం రోడ్లపై జనాల్ని పోగు చేసే కుట్రలో భాగమేనన్నారు. కానీ ఆయన అవినీతిని చూసి ప్రజలు కాదు కదా ఎవరూ రోడ్లపైకి రాలేదన్న ఆయన.. ఈ పరిణామంతో చంద్రబాబు నిశ్చేష్టులయ్యారన్నారు.
పెద్ద పెద్ద లాయర్లు, కోటాను కోట్లు తీసుకున్న వ్యక్తులు, సుప్రీంకోర్టు స్థాయికి చెందిన వారు ప్రాథమిక న్యాయస్థానానికి రావడం చూస్తేనే ఈ మేనేజ్ మెంట్ ఎలా సాగిందో అర్థమవుతుందన్నారు. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ బలమైన సాక్ష్యాలు, ఆధారాలు ఉన్నందునే ఆయనకు రిమాండ్ విధించారని అంబటి రాంబాబు తెలియజేశారు.