ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాల రెండో రోజు రగడ చోటుచేసుకుంది. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడిని విడుదల చేయాలన్న ప్లకార్డులతో TDP సభ్యులు స్పీకర్ పోడియం చుట్టుముట్టారు. సభ మొదలైనప్పటి నుంచి పోడియం వద్దే నిరసనకు దిగారు. చంద్రబాబు నీతిపరుడు అనే ధైర్యం ఉంటే చర్చకు రావాలంటూ మంత్రి అంబటి రాంబాబు స్పష్టం చేశారు. అయినా విపక్ష ఎమ్మెల్యేలు ఏ మాత్రం తగ్గకుండా ఈలలు, స్లోగన్లతో గందరగోళానికి కారణమయ్యారు. దీనిపై మంత్రులు, ఇతర YSRCP సభ్యులు తీవ్రంగా ఆగ్రహం చెందారు. స్పీకర్ పై పేపర్లు విసరడంతో TDP సభ్యులపై విపరీత కామెంట్స్ చేస్తూ వారిని సస్పెండ్ చేయాలని తీర్మానించారు. దీంతో సభ నుంచి ఇద్దరిని సస్పెండ్ చేశారు. అచ్చెన్నాయుడుతోపాటు అశోక్ ను ఈ సెషన్ వరకు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు.
ఈలతో బాలకృష్ణ గోల
TDP ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.. శాసనసభలో వింతగా నిరసన తెలిపారు. మిగతా సభ్యులంతా నినాదాలు, ప్లకార్డులతో స్పీకర్ పోడియం వద్ద ఆందోళన నిర్వహిస్తుంటే బాలకృష్ణ మాత్రం వెరైటీగా ఆందోళన కొనసాగించారు. విజిల్ ను వెంట తెచ్చుకున్న ఆయన.. దాన్ని కంటిన్యూగా ఊదుతూ గోల గోల చేశారు. ఇది అసెంబ్లీనా ఇంకా ఏదైనానా అంటూ YCP సభ్యులు తీవ్రంగా మండిపడ్డారు.