స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్టై జైలు శిక్ష అనుభవిస్తున్న మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడుకు ఎట్టకేలకు బెయిల్ మంజూరైంది. ఆయనకు నాలుగు వారాల పాటు మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. అనారోగ్య సమస్యలు ఉన్నందున చికిత్స కోసం బెయిల్ మంజూరు చేయాలంటూ ఆయన తరఫు న్యాయవాదులు హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు.. బాబుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే ఈ నాలుగు వారాలూ ఆయన హాస్పిటల్ లోనే ఉండాల్సి ఉంటుంది. ఆరోగ్య కారణాల రీత్యా బెయిల్ వచ్చిన దృష్ట్యా ఆ మేరకు చికిత్స తీసుకోవాలి. అంతే తప్ప కుటుంబ సభ్యులు, బంధువుల్ని కలిసేందుకు వీలు లేకపోవచ్చు. తదుపరి విచారణను నవంబరు 28కి వాయిదా వేస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాలిచ్చింది.
సెప్టెంబరు 9న చంద్రబాబును కర్నూలులో అరెస్టు చేసి 10వ తేదీన రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు. అప్పట్నుంచి 52 రోజులుగా ఆయన జైలులో ఉన్నారు. బాబు రెగ్యులర్ బెయిల్ పిటిషన్ పై నవంబరు 10 నుంచి విచారణ జరగనుంది.