
తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి వారు చంద్రప్రభ వాహనంపై ఊరేగారు. కనుల పండువగా సాగిన వేడుకలో స్వామి.. భక్తులను కటాక్షించారు. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని శ్రీవారు.. తిరుమల మాఢ వీధుల్లో విహరిస్తూ దర్శనమిస్తున్నారు. ఈ రోజు(ఆదివారం) పొద్దున 8 నుంచి 10 గంటల వరకు స్వామి వారు సూర్యప్రభ వాహనంపై ఊరేగితూ భక్తకోటికి తన్మయత్వాన్ని అందించారు. లోక కళ్యాణార్థం చేపడతున్న ఈ సేవలో ఇవాళ రాత్రి చంద్రప్రభ వాహనంపై ఊరేగుతున్న దృశ్యాలు తిరుమల గిరులను గోవింద నామస్మరణతో హోరెత్తించాయి. బ్రహ్మోత్సవ వేడుకలను తిలకించేందుకు పెద్దసంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. అశేష భక్త జనవాహిని రాకతో తిరుమల కొండ జనసంద్రంగా మారింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు బంగారు గొడుగు ఉత్సవం నిర్వహించారు.
ఇప్పటివరకు పెద్దశేష, చిన్నశేష, హంస, సింహ, ముత్యపు పందిరి, కల్పవృక్ష, సర్వభూపాల, హనుమంత, మోహినీ అవతారాలతో వాహనాలపై ఊరేగుతూ బ్రహ్మాండకోటిని పులకింపజేశారు. ఈ వేడుకల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం(TTD) విస్తృత ఏర్పాట్లు చేసింది. మరోవైపు స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఆలయ పరిసరాల్లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.