తిరుమల కాలి నడక దారిలో చిన్నారి ప్రాణాలు తీసిన చిరుత పులి.. ఎట్టకేలకు బోనులో చిక్కింది. బాలికపై దాడి చేసిన ప్రాంతంలో తితిదే అధికారులు బోను ఏర్పాటు చేయించారు. దీంతో అర్థరాత్రి పూట చిరుత ఆ బోనులో చిక్కుకుంది. కాలినడక దారిలో చిరుత దాడి చేయడంతో లక్షిత అనే ఆరేళ్ల చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. ఈ నెల 12 రాత్రి 11 గంటలకు లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చేరుకున్న కొద్దిసేపటికే అక్కడ చిరుత దాడికి పాల్పడింది. చిన్నారిని అడవిలోకి లాక్కెళ్లిపోయింది. నెల్లూరు జిల్లా కోవూరు మండలం పోతిరెడ్డిపాడుకు చెందిన కుటుంబం దైవ దర్శనానికి కోసం రాగా.. రాత్రి ఎనిమిదింటికి కాలినడకన ఆ చిన్నారి ఫ్యామిలీ తిరుమలకు బయల్దేరింది.
ఈ ఘటన సంచలనం రేకెత్తించడంతో భద్రతా చర్యల్ని TTD పటిష్ఠం చేసింది. కాలినడక మార్గంలో పోలీసుల సంఖ్యను పెంచగా.. భక్తుల రాక సమయంపై ఆంక్షలు విధించింది. మరోవైపు చిరుతను బంధించేందుకు ప్రత్యేకంగా బోను ఏర్పాటు చేశారు. ఎట్టకేలకు ఆదివారం అర్థరాత్రి ఆ చిరుత.. బోనులో చిక్కుకున్నట్లు అధికారులు ప్రకటించారు.