నిర్ణయం ప్రకటిద్దామనేలోపే పిటిషన్ల మీద పిటిషన్లు వేస్తూ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారంటూ మాజీ CM చంద్రబాబుకు రిమాండ్ విధించిన ACB కోర్టు న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబుకు రాజమండ్రి జైలులో భద్రత లేదని, అది కరడుగట్టిన నేరస్థులుండే కారాగారం కాబట్టి ఆయన హౌజ్ అరెస్టును పరిశీలించాలంటూ ఇప్పటికే పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ రోజు సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ సిద్ధార్థ్ లూథ్రా… AP ప్రభుత్వం తరఫున పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను ఉదహరిస్తూ న్యాయమూర్తికి లూథ్రా చదివి వినిపించారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన పరిస్థితుల్లో మరో పిటిషన్ దాఖలు చేయడం న్యాయమూర్తికి ఆగ్రహం తెప్పించింది.
మీరు వేసిన ఒక పిటిషన్ మీద హియరింగ్స్ కంప్లీట్ అయ్యాక ఒక నిర్ణయం తీసుకుని తీర్పును రిజర్వ్ చేస్తున్నాం.. దాన్ని ప్రకటిద్దామని అనుకునే సమయంలోనే మరో పిటిషన్ వేస్తున్నారు.. ఇలా వేయడం వల్ల ఆ నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం లేకుండా పోతున్నది.. ఇలా పిటిషన్ల మీద పిటిషన్లు వేయడం ఎంతవరకు కరెక్ట్.. ఒక రకంగా నేను పనిచేయకుండా నా విధులకు ఇది ఆటంకం కలిగించడమేనంటూ జడ్జి ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రొసీజర్స్ ఫాలో కావడం లేదని చెబుతూ పిటిషన్లు మధ్యాహ్నం 12 గంటల్లోపే వేయాలని తెలియదా అని అసహనం వ్యక్తం చేశారు.