ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఆంధ్రప్రదేశ్ లో కలకలం సృష్టించగా… దీనిపై ఎన్నికల సంఘం(EC) దృష్టిపెట్టింది. విజయవాడ పోలీస్ కమిషనర్ కు ఎన్నికల ప్రధానాధికారి ఫోన్ చేశారు. జరిగిన ఘటనపై రేపటిలోగా నివేదిక(Report) అందజేయాలని ఆదేశించారు. మరోవైపు జగన్ పై జరిగిన దాడి రాజకీయం(Political)గా విమర్శనాస్త్రాలకు దారితీసింది. ఇది చంద్రబాబు కుట్రేనంటూ YSRCP మంత్రులు, MLAలు అన్ని జిల్లాల్లో ఆందోళనలు చేపట్టారు. ఈ ఘటనపై ప్రధాని మోదీ, తమిళనాడు CM స్టాలిన్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు స్పందించి దాడిని ఖండించారు. జగన్ కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఏం జరిగిందంటే…
గుర్తు తెలియని వ్యక్తి రాయి విసరడంతో జగన్ ఎడమ కంటి పై భాగంలో గాయమైంది. శనివారం రాత్రి ‘మేమంతా సిద్ధం’ యాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న టైమ్ లో దాడి జరిగింది. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గం పరిధిలోని సింగ్ నగర్ గంగానమ్మ గుడి వద్ద గల ప్రైవేటు స్కూల్ వద్ద ఘటన జరిగింది. అప్పుడా ప్రాంతంలో కరెంటు లేకపోగా.. జగన్ తోపాటు YCP సెంట్రల్ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ కూ రాయి తగిలి చిన్న గాయమైంది. జగన్ నుదుటికి రెండు కుట్లు పడ్డాయి. CM సెక్యూరిటీ గ్రూపు, ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ వింగ్(ISW), ఎస్కార్ట్ సహా ఏడెనిమిది రకాల భద్రతా వ్యవస్థలు ఉండగా సీఎంపై దాడి జరగడం సంచలనంగా మారింది.