వలంటీర్లపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను AP సర్కారు సీరియస్ గా తీసుకుంది. ఈ విషయంలో పవన్ ను విచారించేందుకు అనుమతి ఇస్తూ ఆదేశాలు(orders) ఇచ్చింది. న్యూస్ పేపర్లు, ప్రసార మాధ్యమాల్లో వచ్చిన వార్తల ఆధారంగా జనసేనానిపై కేసుల నమోదుకు జగన్ సర్కారు అనుమతి ఇచ్చింది. వలంటీర్లపై చేసిన కామెంట్లకు గాను ఆయనపై కేసులు పెట్టి ప్రాసిక్యూట్ చేయడంతోపాటు పవన్ కల్యాణ్ పై సంబంధిత కోర్టుల్లో వ్యక్తిగతంగా పరువు నష్టం దాఖలు చేయాల్సిందిగా సూచించింది. గ్రామ వార్డు వలంటీర్లు, సచివాలయాల శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ పేరిట ఈ ఆర్డర్స్ వచ్చాయి.
ఆయన చేసిన కామెంట్ల వల్ల వలంటీర్ల వ్యవస్థ ప్రతిష్ఠకు భంగం కలిగిందని, జులై 9న ఏలూరులో చేసిన ప్రసంగం తీరుపై ఈ ఆర్డర్స్ ఇస్తున్నట్లు అందులో తెలిపింది. వారాహి విజయయాత్రలో భాగంగా ఏలూరులో మాట్లాడిన పవన్.. APలో 29,000 మంది మహిళలు కనిపించకుండా పోయారు.. వీరిలో కొంతమంది మాత్రమే తిరిగివచ్చారు.. కానీ మిగతావారు ఏమయ్యారు.. వలంటీర్లు సేకరించిన ఇన్ఫర్మేషన్ అంతా తప్పుదారి పట్టి సంఘ విద్రోహ శక్తుల్లోకి వెళ్తోందని అన్నారు.